పెళ్లి తరువాత వివా'హితం'కావాలంటే..! | new couple planings and savings and investments advice | Sakshi
Sakshi News home page

పెళ్లి తరువాత వివా'హితం'కావాలంటే..!

Published Mon, Aug 1 2016 12:23 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

పెళ్లి తరువాత వివా'హితం'కావాలంటే..! - Sakshi

పెళ్లి తరువాత వివా'హితం'కావాలంటే..!

‘కొత్త జంట’కు ముందు నుంచే ప్లానింగ్ కావాలి
బ్యాంకులో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరవండి
దీని ద్వారానే ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించండి
ఆర్థిక వ్యవహారాల్లో దాగుడుమూతలు వద్దు.
టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం; రిటైర్మెంట్‌కూ ప్లానింగ్
వయసు పెరిగే కొద్దీ రిస్క్ తీసుకోవడం తగ్గించాలి
భాగస్వామి నిర్ణయాలు విఫలమైతే.. విమర్శించొద్దు

ఎవరు ఎన్ని కబుర్లయినా చెప్పొచ్చు. కానీ దాదాపు అందరూ వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి మజిలీని చేరుకోవాల్సిందే!!. ఒంటరిగా ఉన్నపుడు ఎలా ఉన్నా ఫర్వాలేదు. జంటయ్యాక మాత్రం విధానాలు మారాలి. ఆ మార్పు మన ఆర్థిక ప్రణాళికలతో ప్రారంభమవ్వాలి. వివాహమనేది ఒక వాహనమైతే.. ఆ వాహనానికి ఆర్థిక ప్రణాళికలనే ఇంధనం అధిక మైలేజ్‌ను ఇస్తుంది. పెళ్లి తర్వాత జీవితం సాఫీగా సాగాలంటే సరైన ఆర్థిక ప్రణాళికలు... వాటి కి అనువుగా వ్యూహాలు అవసరం. అదెలాగో చూద్దాం...

పెట్టుబడుల పునఃసమీక్ష తప్పనిసరి..
సరైన ఆర్థిక ప్రణాళికల్ని, వ్యూహాల్ని రూపొందించుకున్నాక వాటి కనుగుణంగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టే పెట్టుబడుల్ని క్రమానుగతంగా సమీక్షించుకోవాలి. అంటే మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్లు మంచి రాబడిని అందిస్తున్నాయా? లేదా? అని చూసుకోవాలి. సరైన ఫలితాలివ్వని పెట్టుబడులను ఇతర సాధనాల్లోకి బదిలీ చేయండి. పెట్టుబడుల తగిన రిటర్న్స్‌కు ఇది కీలకం. ఇన్వెస్ట్‌మెంట్లు వృద్ధి చెందేలా చూసుకోండి.

అవసరాలన్నీ ముఖ్యమే...
జీవితంలో అనేకం డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. చాలా పనులయ్యేది దాంతోనే. కొత్తగా పెళ్లయిన వారికి జీవితంపై ఎన్నో కలలుంటాయి. వాటిల్లో సొంతిల్లు, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు, విహార యాత్రలు, వయస్సు మల్లిన తల్లిదండ్రుల సంరక్షణ, అత్యవసర వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ వంటివి ప్రధానమైనవి. అందుకే కొత్త జంట వీటన్నిటినీ వివరంగా చర్చించుకొని, వాటికనుగుణంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోవడం మరిచిపోవద్దు.

 సరైన సాధనాలతోనే సాకారం...
ఒక్కసారి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక వాటికి అనువైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల గురించి తెలుసుకోవాలి. సరైన సాధనాల్లో పెట్టుబడి పెడితేనే కదా... మన కలలు సాకారమయ్యేది!. అందుబాటులో ఉన్న అన్ని పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకోండి. అవసరమనుకుంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. మీ ఆదాయం, వ్యయాలు, మీ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం, రిస్క్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వంటివన్నీ భార్యాభర్తలిద్దరూ చర్చించండి. వ్యూహాలు సిద్ధం చేసుకోండి.

ఈ అంశాలు పరిశీలించండి..
కొత్తగా పెళ్లయిన వారు బ్యాంకులో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరవండి. ప్రతి నెలా కొంత డబ్బుల్ని అందులో దాచుకోండి.
మీ ఇన్వెస్ట్‌మెంట్లన్నిటినీ ఈ జాయింట్ అకౌంట్ ద్వారానే చేయండి.
ఆర్థిక వ్యవహారాలను ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించుకోండి.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే ఇద్దరూ కలిసి పరిష్కారం వెతకండి.
పెళ్లయిన తొలినాళ్లలో అధిక రిస్క్‌ను భరించడానికి ముందుండండి. అప్పుడే ఎక్కువ లాభాలొచ్చే అవకాశముంటుంది. వయసు పెరిగే కొద్దీ రిస్క్ భరించే సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ వెళ్లండి.
మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ ఇన్వెస్ట్‌మెంట్లను తగిన విధంగా ఉండేలా చూసుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. మీ అవసరాలు పెరిగే కొద్ది పాలసీ కవరేజ్‌ను పెంచుకోండి.
మీకు ఏవైనా నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలుంటే.. మనీ బ్యాక్ పాలసీలను గురించి పరిగణనలోకి తీసుకోండి.
ముందుగానే మీ రిటైర్‌మెంట్‌ను ప్లాన్ చేసుకోండి. అలాగే అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్లండి.
విభిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. అన్ని గుడ్లనూ ఒకే పెట్టెలో పెట్టకూడదనే సామెతను గుర్తుంచుకోండి.
మీ భాగస్వామి నిర్ణయాలు విఫలమైనప్పుడు.. వారిని విమర్శించొద్దు. మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తపడండి.
మీ ఇన్వెస్ట్‌మెంట్లు మంచి రాబడిని అందించినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఆ సంతోషాన్ని ఇరువురూ పంచుకోండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement