ఎన్‌పీఎస్‌ ఎందుకు వద్దట? | News about National Pension Scheme | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌ ఎందుకు వద్దట?

Published Mon, Jan 8 2018 1:10 AM | Last Updated on Mon, Jan 8 2018 1:10 AM

News about National Pension Scheme - Sakshi

పన్ను పరంగా ఆదాకు అవకాశమివ్వటం...రిటైరయిన తరవాత పింఛన్‌ ఉండని వారికి భరోసా కల్పించటం.. ఈ రెండే ప్రధాన లక్ష్యాలుగా దేశంలో జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ప్రారంభమయింది. ఉద్యోగుల్లో చాలా మందికి పింఛన్‌ లేదు కనక... వారిని దృష్టిలో పెట్టుకుని ఆరంభించిన పథకమిది. నిజానికి దేశంలో అత్యధికులు పింఛన్‌ అవకాశం లేనివారే!! కానీ వారిలో చాలా మంది ఎన్‌పీఎస్‌వైపు చూడటం లేదు. ఎందుకని? దీన్లో ఉన్న లోపాలేంటి? సరిదిద్దాల్సిన అంశాలేంటి? ఇదే విషయమై ఈ మధ్య జాతీయ స్థాయిలో ఓ సర్వే జరిగింది. దాన్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాల సమాహారమే ఈ కథనం...

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) పన్ను ఆదాకు వీలు కల్పించినా 60వ ఏట వరకు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటానికి అవకాశం లేదు. ఈ లాకిన్‌ వ్యవధి చాలా మందికి నచ్చటం లేదు. ఇక పథకం కాల వ్యవధి ముగిసిన తర్వాత... అంటే 60వ ఏట చేతికొచ్చే నిధిలో 60 శాతంపై పన్ను విధిస్తున్నారు. ఇది మరికొందరికి నచ్చటం లేదు. కాల వ్యవధి తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను విధిస్తున్నారు కాబట్టి... పెట్టుబడి పెట్టేటపుడు పన్ను మినహాయింపు ఇస్తున్నా అది ఇవ్వనట్టేనని కొందరి భావన. ఈ తరహా కారాణాలే వారిని ఎన్‌పీఎస్‌కు దూరంగా ఉండేలా చేస్తున్నాయంటూ ఈ సర్వేలో వెల్లడైంది. వాటిపై నిపుణుల అభిప్రాయాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలకు తగ్గట్టే ఉన్నాయి.

ఎన్‌పీఎస్‌ కార్పస్‌పై పన్ను భారమే!!
ఈపీఎఫ్, పీపీఎఫ్‌ మాదిరిగా కాకుండా ఒక్క ఎన్‌పీఎస్‌లో మాత్రం గడువు ముగింపునాటికి చేతికొచ్చే నిధిలో 40 శాతమే పన్ను రహితం. మిగతా 60 శాతంపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నే ఎన్‌పీఎస్‌కు పెద్ద విఘాతం. పైపెచ్చు పన్ను రహితంగా తీసుకున్న 40 శాతం నిధులను తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇది కూడా పన్ను పరిధిలోకి వచ్చినట్టేనని, యాన్యుటీ ప్లాన్‌ నుంచి ప్రతి నెలా వచ్చే పెన్షన్‌ ఆదాయం పన్ను పరిధిలోకి రావడమే కారణమని అవుట్‌లుక్‌ ఏషియా క్యాపిటల్‌ సీఈవో మనోజ్‌ నాగ్‌పాల్‌ అభిప్రాయపడ్డారు.

పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌ హేమంత్‌ సైతం ఎన్‌పీఎస్‌పై పన్ను సమంజసం కాదని అంగీకరించారు. అయితే, పన్ను తగ్గించుకోవడానికి మార్గాలున్నాయన్నది ఆయన అభిప్రాయం. ‘‘40 శాతం కార్పస్‌పై పన్ను లేదు. మరో 40 శాతాన్ని యాన్యుటీలో పెట్టడం ద్వారా దానిపై కూడా పన్ను లేకుండా తప్పించుకోవచ్చు. మిగిలిన 20 శాతంపై కూడా పన్ను వద్దనుకున్నారనుకోండి. దాన్ని కూడా యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు’’ అని హేమంత్‌ సూచించారు.

‘‘రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఎన్‌పీఎస్‌ అనుమతిస్తోంది. 70వ సంవత్సరం వచ్చే వరకు వాయిదాల రూపంలో వెనక్కి తీసుకోవచ్చు. సరైన ఉపసంహరణ ప్రణాళికతో పన్నును సున్నాకు తగ్గించుకునే అవకాశం ఉంది’’ అనేది ఆయన అభిప్రాయం. కాకపోతే యాన్యుటీ ప్లాన్‌పై నెలనెలా వచ్చే పెన్షన్‌.. పన్ను పరిధిలోనే ఉంటుందనేది గమనార్హం.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మాదిరి ఎన్‌పీఎస్‌లో పన్ను ప్రయోజనాలు లేవనేది మనోజ్‌ నాగ్‌పాల్‌ అభిప్రాయం. ‘‘స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. డెట్‌ పథకాల రాబడులపై మాత్రం మూడేళ్ల తర్వాత తక్కువ పన్ను రేటుకు తోడు ద్రవ్యోల్బణం తీసివేత ప్రయోజనం ఉంది’’ అన్నారాయన.

వాస్తవానికి మన దేశంలో పన్ను ప్రయోజనాలే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న మాట వాస్తవం. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారిలోనూ అధికులు పన్ను ఆదా ఉద్దేశంతో పెడుతున్నవారేనని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్‌ కంటే ఎన్‌పీఎస్‌ మెరుగైన రాబడులిస్తున్నప్పటికీ... వీటిపై పన్ను ప్రయోజనం లేకపోవడం ప్రతికూలం. ఈపీఎఫ్‌ మాదిరిగా ఎన్‌పీఎస్‌లోనూ పన్ను ప్రయోజనాలుంటేనే... దాన్నుంచి ఎన్‌పీఎస్‌కు మారతారన్న అంచనాలున్నాయి.

ఈక్విటీలకు పరిమితి ఇబ్బందే!
సాధారణంగా యువ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. రిస్క్‌ తీసుకునే సామర్థ్యమే వారి ఆసక్తికి కారణం. కానీ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతమే. లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ ఆప్షన్‌లో ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ వాటా తగ్గుతుంది. ఈ పరిమితి వల్ల ఈక్విటీల నుంచి గణనీయమైన రాబడులు రాకుండా పోతాయనేది ఫైనాన్షియల్‌ ప్లానర్ల అభిప్రాయం.

అవగాహన కలిగిన ఇన్వెస్టర్లయితే వేటికి ఎంత మేర పెట్టుబడులు వెళ్లాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారనేది మనీ హన్స్‌ వ్యవస్థాపకురాలు హన్సి మెహరోత్రా అభిప్రాయం. ‘‘రిటైర్మెంట్‌ అనేది సుదీర్ఘ కాల లక్ష్యం. కాబట్టి తక్కువ ఫీజులతో గణనీయమైన రాబడులందించే పథకంలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మార్పులకు అవకాశం ఉండకూడదు.   ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు ఉన్న పరిమితిని తొలగించి 100 శాతం పెట్టుబడులకు అనుమతించినట్టయితే పదవీ విరమణకు ఇది సరైన సాధనం అవుతుందనేది నా అభిప్రాయం’’ అన్నారామె.

అయితే, ఇదే విషయమై సుశీల్‌ ఫైనాన్స్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెండ్‌ ముకేశ్‌షా స్పందిస్తూ... ‘‘ఎన్‌పీఎస్‌ రిటైర్మెంట్‌ కోసం ఉద్దేశించింది. ఈక్విటీలకు 50 శాతం పరిమితితో మార్కెట్లలో తీవ్రమైన హెచ్చు, తగ్గుల నుంచి రక్షణ ఉంటుంది. అదే సమయంలో స్థిరాదాయ పథకాల కంటే అధిక రాబడులకు వీలు కల్పిస్తుంది’’ అని పేర్కొన్నారు. 50 శాతం పరిమితి తొలగించి 100 శాతం ఈక్విటీలకు అనుమతిస్తే  స్వల్ప కాలం నుంచి మధ్య కాలంలో ప్రతికూల రాబడులకు దారితీయవచ్చని, మార్కెట్లు డౌన్‌సైడ్‌లో ఉంటే రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారి పెట్టుబడుల విలువ తరిగిపోతుందని చెప్పారాయన.

యాన్యుటీలో తప్పనిసరి ఇన్వెస్ట్‌మెంట్‌?
ఎన్‌పీఎస్‌ నిధిలో 40 శాతాన్ని తప్పనిసరిగా పెన్షన్‌ యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలి. యాన్యుటీ ప్లాన్‌లో రాబడులు చాలా తక్కువ. దీంతో గడువు ముగిశాక చేతికందే నిధులను తమ స్వేచ్ఛ కొద్దీ ఎక్కువ రాబడులొచ్చే చోట పెట్టే హక్కు ఇన్వెస్టర్లకు లేదు. ఇది కూడా ఎన్‌పీఎస్‌ వైపు చాలా మంది చూడకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి. 40 శాతం కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం అన్నది పదవీ విరమణ తర్వాత ద్రవ్యోల్బణంతో పోరాడే సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని ఆర్థిక నిపుణుడు, ఐఐటీ ప్రొఫెసర్‌ కూడా అయిన ఎం.పట్టాభిరామ్‌ అభిప్రాయపడ్డారు.

6 శాతం ద్రవ్యోల్బణం ఐదేళ్ల కాలంలో కొనుగోలు శక్తిని 25 శాతం మేర హరిస్తుందని, 12 ఏళ్లలో 50 శాతాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ఇక పన్ను ఆదా కోసమని 60 శాతం కార్పస్‌ను యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేసే వారు మరింత నష్టపోవాల్సి వస్తుందన్నారు. అయితే... తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాలన్న నిబంధనతో రిటైర్‌ అయిన వ్యక్తి జీవిత కాలం పాటు పెన్షన్‌ అందుకోవచ్చనేది హేమంత్‌ నాగ్‌పాల్‌ అభిప్రాయం. ఈ వాదనను కోటక్‌ పెన్షన్‌ ఫండ్‌ సీఈవో సందీప్‌ శ్రీఖండే కూడా సమర్థించారు.

‘‘సామాన్యుల చేతికి ఏక మొత్తంలో డబ్బులందితే ఆ మొత్తాన్ని వెంటనే ఖర్చు చేసే ధోరణి పెద్ద ప్రతికూలత. వీరు రిటైర్మెంట్‌ నిధులను పిల్లల విద్య లేదా వివాహాలు లేదా ఇంటి అవసరాలకు ఖర్చు చేస్తుండడం సాధారణంగా జరుగుతుంటుంది. దీంతో పెన్షన్‌ నిధికి మిగిలేది తక్కువే’’ అని శ్రీఖండే వివరించారు. యాన్యుటీ రేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం మరో ప్రధానమైన అంశం. రూ.50 లక్షలు యాన్యుటీ ప్లాన్‌లో పెడితే, ప్రతీ నెలా వచ్చే పెన్షన్‌ రూ.30,000 స్థాయిలోనే ఉంటుంది. మరో సమస్య యాన్యుటీ నుంచి అందుకునే పెన్షన్‌ మొత్తంపై పన్ను అమలవడం.

యాన్యుటీల నుంచి అందుకునే పెన్షన్‌పై పన్ను ప్రయోజనాలు కల్పిస్తే ఎన్‌పీఎస్‌ మరింత ప్రాచుర్యంలోకి వస్తుందనేది నిపుణుల మాట. అలాగే, ఎన్‌పీఎస్‌ కార్పస్‌ను ఇతర పెన్షన్‌ సాధనాలైన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తే బావుంటుందన్నారు. కనీసం ఎన్‌పీఎస్‌ ఇన్వెస్టర్లకు ప్రత్యేక వడ్డీ రేటును ఆఫర్‌ చేయాలని వారు కోరారు.

60 ఏళ్ల లాకిన్‌ కాస్త ఇబ్బందే...
ఎన్‌పీఎస్‌ చందాదారులు 60 ఏళ్లు వచ్చేలోపు పెట్టుబడులను పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఈ నిబంధన నచ్చని వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఆర్థిక సలహాదారులు సైతం పెట్టుబడులను ముందుగా తీసుకునే స్వేచ్ఛ ఉండాలంటున్నారు. అయితే, 60వ ఏడు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకోవటానికున్న ఒకే మార్గం... 80 శాతం నిధులన్ని యాన్యుటీలో పెట్టి చేయటం. అపుడు 20 శాతం నిధులే ఇన్వెస్టర్‌కు మిగులుతాయి.

ఈ పథకంలో మొత్తం మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకూ అవకాశం ఉన్నా ప్రత్యేక అవసరాలకు పరిమితం చేశారు. రెండు ఉపసంహరణల మధ్య విరామ సమయం ఐదేళ్లుగా ఉంది. కానీ ఈ విధమైన నియం త్రణల వల్ల విద్య, వివాహం అవసరాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, ఈ నియంత్రణలను ఎత్తివేస్తే రిటైర్మెంట్‌ ప్రణాళిక దెబ్బతింటుందని వాదించే వారూ ఉన్నారు. ‘‘దీర్ఘకాల సాధనాల్లో పెట్టుబడులను కొనసాగించడం ద్వారా అధిక రాబడులను ఆర్జించొచ్చు.

విశ్రాంత జీవనం కోసం చేస్తున్న పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సింది ఇదే. కేవలం డబ్బుల్ని వెనక్కి తీసుకోవటం మాత్రమే కాదు. దీనివల్ల దీర్ఘకాలంలో రెట్టింపయ్యే ప్రతిఫలాన్ని కోల్పోయినట్టవుతుంది’’ అని విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ దక్షిణాసియా విభాగం హెడ్‌ కులిన్‌ పటేల్‌ తెలిపారు. ‘‘ఉపసంహరణలపై ఎన్‌పీఎస్‌ నిబంధనలు సమంజసంగానే ఉన్నాయి. పెట్టుబడుల్ని వెంటనే వెనక్కి తీసుకోకుండా నిరుత్సాహపరచడం వల్ల రిటైర్మెంట్‌కు భారీ మొత్తంలో నిధి సమకూరే అవకాశం ఉంటుంది. నిజమైన వైద్య అవసరాలకు పెట్టుబడులను పాక్షికంగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఎటూ ఉంది’’ అన్నారాయన.

రాబడులకు హామీ లేదు!
రాబడులపై ఎటువంటి హామీ లేకపోవడమే కార్మిక సంఘాలు ఎన్‌పీఎస్‌ను వ్యతిరేకించడానికి కారణం. దీన్ని పెన్షన్‌ పథకం అని పిలవకూడదని, ఎందుకంటే పెన్షన్‌ ఎంత వస్తుందనేది నిర్వచించకపోవడమేనని వాదన. ఎన్‌పీఎస్‌ అన్నది మార్కెట్లు బాగా పెరిగినందున ప్రస్తుతానికి బాగానే కనిపిస్తుందని, డౌన్‌ట్రెండ్‌లో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఒకవేళ మార్కెట్లు పతనమైన సంవత్సరంలో పదవీ విరమణకు వచ్చిన వారి పరిస్థితి ఏంటి? మార్కెట్లలో బేరిష్‌ ట్రెండ్‌ 5–10 ఏళ్ల పాటు కొనసాగితే రిటైర్మెంట్‌ ప్రణాళిక తల్లకిందులవుతుంది కదా? అనేవి వారి ప్రశ్నలు. అయితే, ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలే కాకుండా పూర్తిగా గిల్ట్‌ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు పెట్టే ఆప్షన్లను ఎంచుకునే అవకాశమూ ఉంది. రిస్క్‌ భరించలేని వారు వీటిని ఎంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎన్‌పీఎస్‌లో గత ఏడాది కాలంలో గిల్ట్‌ఫండ్స్‌ ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే కేవలం 2 శాతమే తక్కువ రాబడులనిచ్చాయి. దీంతో ఇవి రిస్క్‌ తీసుకోలేని వారికి ఉత్తమ ఆప్షన్‌గా పేర్కొంటున్నారు.

ఏ అంశాన్ని ఎందరు ఇబ్బందిగా భావిస్తున్నారు...?
ఎన్‌పీఎస్‌ నిధిపై పన్ను వేయడం    35 %
ఈక్విటీలపై పరిమితి    12 %
యాన్యుటీ తప్పనిసరి చేయడం    31 %
60 ఏళ్లలోపు వెనక్కి తీసుకోలేకపోవడం    44 %
మార్కెట్‌ ఆధారిత రాబడులు    7 %

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement