
కోల్‌కతా: మొండి బాకీల కేసులో కేబుల్ తయారీ సంస్థ నికో కార్పొరేషన్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా బెంచ్ ఆదేశించింది. దివాలా చట్టంలోని సెక్షన్ 14 కింద కంపెనీపై ఈ చర్యలు తీసుకుంటారు. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్) రద్దు తర్వాత ఎన్‌సీఎల్‌టీ ముందుకు వచ్చిన తొలి కంపెనీ నికోనే. బ్యాంకర్లు కాకుండా తామే స్వయంగా ఎన్‌సీఎల్‌టీని అశ్రయించినట్లు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ కౌల్ చెప్పారు. తాము అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కంపెనీ లిక్విడేషన్ ఆదేశాలు రావడం ఆశ్చర్యపరిచినట్లు తెలియజేశారు. ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
నికో రెండు ప్లాంట్లలో (పశ్చిమ బెంగాల్‌లోని శ్యామ్‌నగర్, ఒడిషాలోని బారిపద) సుమారు 600 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. పునర్‌వ్యవస్థీకరణ కోసం ఇచ్చిన 270 రోజుల గడువు ముగియడంతో లిక్విడేషన్ అనివార్యంగా మారిందని నికో కార్పొరేషన్‌కి నిర్దేశించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) కునాల్ బెనర్జీ తెలిపారు. ఈ లోగా సంస్థ యాజమాన్యం సమర్పించిన పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీని రుణదాతలు తిరస్కరించినట్లు వెల్లడించారు. వివిధ బ్యాంకుల నుంచి నికో సుమారు రూ. 186 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఇందులో అత్యధిక భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందినదే.
Comments
Please login to add a commentAdd a comment