
బుల్.. ధనాధన్!
రికార్డుల ర్యాలీ...
⇒కొత్త గరిష్ట స్థాయిలను తాకిన సెన్సెక్స్. నిఫ్టీ
⇒ముగింపులోనూ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు
⇒522 పాయింట్ల ప్లస్‌తో 28,785కు సెన్సెక్స్
⇒145 పాయింట్ల లాభంతో 8,696కు నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం, లోహ, చమురు, గ్యాస్ షేర్లలో రికవరీ కారణంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి.
విదేశీ నిధుల ప్రవాహం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చిందని ట్రేడర్లంటున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ ఆర్జన అంచనాలు బాగా ఉండడం, రానున్న బడ్జెట్‌లో సంస్కరణలుంటాయనే అంచనాలు.... ఇవన్నీ స్టాక్ మార్కెట్ల జోరుకు ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు. ఆర్‌బీఐ రేట్లకోతతో మొదలైన ర్యాలీ, మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో కొనసాగుతోందని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు దీపేన్ షా వివరించారు. చైనా జీడీపీ గణాంకాలు అంచనాలను మించి ఉండడం, యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీని ఇస్తుందన్న అంచనాలు ర్యాలీకి మరింత తోడ్పాటునందించాయని పేర్కొన్నారు. 2016 వరకూ భారత వృద్ధికి ఢోకా లేదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్ల జోరును మరింత పెంచింది.
సూచీల జోరు: బీఎస్‌ఈ సెన్సెక్స్ 522 పాయింట్లు లాభపడి 28,785 పాయింట్ల వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 8,696 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇవి రెండూ ముగింపులో కొత్త గరిష్ట స్థాయిలు. ఇక నిఫ్టీ 8,700 స్థాయిని తొలిసారి దాటేసింది. వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్లు లాభపడ్డాయి. ఇంట్రా డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 28,829ను, నిఫ్టీ 8,708 పాయింట్లను తాకాయి.
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ హాట్ ఫేవరేట్‌గా నిలవనున్నదని ... 2016లో వృద్ధి రేటు విషయంలో చైనాను భారత్ మించిపోనున్నదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించింది. చైనా జీడీపీ గణాంకాలు అంచనాలను మించడంతో లోహ షేర్లు దూసుకుపోయాయి. లోహాలను అధికంగా వినియోగించే చైనా వృద్ధిపై ఆందోళనలను ఈ జీడీపీ గణాంకాలు తగ్గించాయని, దీంతో లోహ షేర్లు వెలిగిపోయానని విశ్లేషకులు పేర్కొన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ జోరు...
ఆర్‌బీఐ రెపోరేట్ కోత వల్ల బ్యాంకుల కంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకే అధిక లాభదాయకమన్న అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 5.8 శాతం పెరిగి 1,251 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇక సెసాస్టెరిలైట్ 5.3%, టాటా స్టీల్ 4.5%, యాక్సిస్ బ్యాంక్ 4.3%, టాటా మోటార్స్ 3.7%, ఐటీసీ 3.5%, హిందాల్కో 3%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.4%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.7%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.7%, ఎస్‌బీఐ 1.5 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.3%, విప్రో 1% చొప్పున పెరిగాయి. గెయిల్ 1.9 శాతం క్షీణించింది.
మొత్తం 1,560 షేర్లు లాభాల్లో ముగియగా, 1,412 షేర్లు నష్టపోయాయి. మొత్తం టర్నోవర్ రూ.3,292 కోట్లుగా నమోదైంది. ఇక ఎన్‌ఎస్‌ఈలో నగదు విభాగంలో రూ. 18,133 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,90,288 కోట్ల టర్నోవర్ నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,276 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.762 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఆసియా, యూరప్‌లోని ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి.
ఏడాది గరిష్టానికి 199 షేర్లు
మంగళవారం నాటి రికార్డ్‌ల ర్యాలీలో దాదాపు 199 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి చేరాయి. బ్లూ చిప్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇక ఇతర స్టాక్‌లు-యస్ బ్యాంక్, వర్ల్ పూల్ ఆఫ్ ఇండియా, స్పైస్‌జెట్, మైండ్‌ట్రీ, ఎంఆర్‌ఎఫ్, హెచ్‌టీ మీడియా షేర్లు కూడా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వీటితో పాటు బాష్, యునెటైడ్ స్పిరిట్స్, శ్రీ సిమెంట్స్, బీఏఎస్‌ఎఫ్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ, సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీలు కూడా ఏడాది గరిష్ట స్థాయి షేర్ల క్లబ్‌లో స్థానం సాధించాయి.
ఎందుకు పెరిగాయంటే...
⇒ ఆర్‌బీఐ రెపోరేట్‌ను తగ్గించడం
⇒ అంచనాలను మించిన చైనా జీడీపీ వృద్ధి గణాంకాలు
⇒ ప్రపంచంలోనే భారత్ భేష్ అన్న ఐఎంఎఫ్ తాజా నివేదిక
⇒ యూరప్ కేంద్ర బ్యాంక్ నుంచి ప్యాకేజీ వస్తుందన్న అంచనాలు
⇒ బడ్జెట్‌లో మరిన్ని సంస్కరణలు వస్తాయన్న ఆశాభావం
రికార్డ్‌ల ర్యాలీతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.89,000 కోట్లకు పైగా వృద్ధి చెందింది. రూ.102.3 లక్షల కోట్లకు ఎగబాకింది.