రికార్డ్ స్థాయిలో ముగిసిన నిఫ్టీ
♦ జీఎస్‌టీ జోష్
♦ 30 పాయింట్ల లాభంతో 9,174కు ముగింపు
♦ నిఫ్టీ ముగింపులో.. ఇదే జీవిత కాల గరిష్ట స్థాయి
♦ 116 పాయింట్ల లాభంతో 29,647కు సెన్సెక్స్
జీఎస్‌టీ సంబంధిత నాలుగు బిల్లులు బుధవారం లోక్‌సభ ఆమోదం పొందడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు లాభపడడం ఇది వరుసగా మూడో రోజు. ఇంట్రాడేలో 153 పాయింట్ల వరకూ లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 116 పాయింట్ల లాభంతో 29,647 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 9,174 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీకి ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు. ఈ నెల 17న నిఫ్టీ 9,160 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా రికార్డ్ స్థాయిలో ముగిసింది. ఈ సూచీ 1 శాతం లాభంతో 21,620 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండడం, మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా షార్ట్ కవరింగ్ జరగడం సానుకూల ప్రభావం చూపాయి. జీఎస్‌టీ 4 బిల్లులకు లోక్‌సభ ఆమోదం పొందడం మార్కెట్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్‌సీనియర్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) కార్తీక్ రాజ్ లక్ష్మణన్ చెప్పారు.
లాజిస్టిక్స్ షేర్లకు లాభాలు...
జీఎస్‌టీ ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రావడం దాదాపు ఖాయం కావడంతో లాజిస్టిక్స్ షేర్లు లాభపడ్డాయి. ఆర్షియ, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, స్నోమాన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, గతి షేర్లు 5% వరకూ లాభపడ్డాయి. సుప్రీం కోర్ట్ తీర్పు కారణంగా బుధవారం నష్టపోయిన వాహన షేర్లు గురువారం కొనుగోళ్ల దన్నుతో కోలుకున్నాయి
కొనసాగిన బ్యాంక్ షేర్ల జోరు..
బ్యాంక్ షేర్ల లాభాలు గురువారం కూడా కొనసాగాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. మొండి బకాయిల సమస్యను సత్వరం పరిష్కరించగలమని ప్రభుత్వం హామీ ఇవ్వడం, వచ్చే వారం ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ ఉన్న నేపథ్యంలో బ్యాంక్ షేర్లు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభాల్లో, 13 షేర్లు నష్టాల్లో ముగిశాయి.