ప్రభుత్వ పెట్రో షేర్ల పరుగులు
► రెండు రోజుల క్షీణతకు మార్కెట్ బ్రేక్
► సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు అప్
ముంబై: ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు పరుగులు తీయడంతో పాటు ఇతర రంగాల ప్రభుత్వ రంగ షేర్లు, మెటల్ షేర్లు పెరగడంతో మార్కెట్లో రెండురోజుల క్షీణతకు బ్రేక్‌పడింది. గత రెండు రోజుల్లో 337 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం 88 పాయింట్లు (0.27 శాతం) పెరిగి 32,325 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్ల (0.53 శాతం) పెరుగుదలతో 10,066 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఈ వారంలో సెన్సెక్స్ మొత్తంమీద 15.53 పాయింట్లు, నిఫ్టీ 51,90 పాయింట్ల చొప్పున పెరిగాయి. సూచీలు లాభపడటం వరుసగా ఇది ఐదోవారం. యూరప్‌లో మార్కెట్లు పటిష్టంగా ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్‌చేసుకున్నారని, దాంతో మార్కెట్ పెరుగుదల సాధ్యపడిందని విశ్లేషకులు చెప్పారు. కొన్ని బ్లూచిప్ కంపెనీల ఫలితాలు...అంచనాల్ని మించాయని, దాంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్లు వారు తెలిపారు.
ఐఓసీ 8 శాతం అప్...
ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్ కంపెనీ ఐఓసీ క్రితం రోజు ఫలితలు ప్రకటించిన తర్వాత 5 శాతం వరకూ పెరగ్గా, తాజాగా మరో 8 శాతం ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ. 418 వద్ద ముగిసింది. మరో పెట్రో కంపెనీ బీపీసీఎల్ 5 శాతంపైగా ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 518 వద్ద క్లోజయ్యింది. ఈ రెండు కంపెనీలూ నిఫ్టీ–50లో భాగమైనందున, సెన్సెక్స్‌కంటే నిఫ్టీ అధికశాతం పెరిగింది. శుక్రవారం ఫలితాలు వెల్లడించిన ఇంకో పెట్రో కంపెనీ హెచ్‌పీసీఎల్ పెద్ద ఎత్తున 10 శాతం వరకూ ర్యాలీ జరిపి నూతన గరిష్టస్థాయి రూ. 433 వద్ద క్లోజయ్యింది.
ఫార్మా డౌన్...
ఫార్మా షేర్లలో వరుసగా మూడోరోజు డౌన్‌ట్రెండ్ కొనసాగింది. డాక్టర్ రెడ్డీస్ లాబ్ 3.7 శాతం క్షీణించి 52 వారాల కనిష్టస్థాయి రూ. 2,239 వద్ద ముగిసింది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, లుపిన్‌లు కూడా క్షీణతతో ముగిసాయి.