2030కల్లా 1,30,00కు నిఫ్టీ!
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ 2030కల్లా 1,30,000 పాయింట్లను తాకుతుందని ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా అంచనా వేశారు. గత పదిహేనేళ్లలో 10 రెట్లు ఎగసిన నిఫ్టీ రానున్న పదిహేనేళ్లలో అతిసులువుగా 10 లేదా 12 రెట్లు జంప్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎన్‌బీసీ టీవీ18 చానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఝున్‌ఝన్‌వాలా ఈ అభిప్రాయాలను వెల్లడించారు. దేశీ కంపెనీల ఆర్జన ఏడాదికి 16% చొప్పున వృద్ధి సాధిస్తే రానున్న దశాబ్దంలో నిఫ్టీ 1,30,000 పాయింట్లను చేరుతుందని ఝున్‌ఝన్‌వాలా అంచనా వేశారు.
గడిచిన 12 నెలల్లో ట్రేడింగ్ రోజులను పరిగణనలోకి తీసుకుని గంటకి సగటున రూ. 35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశం పురోభివృద్ధి బాటన దూసుకెళుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉన్నదని, చమురు ధరల పతనంవల్ల వినియోగదారులకు పూర్తిస్థాయిలో లబ్ది చేకూరనప్పటికీ, వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. తాజా పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించనందుకు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ విచారిస్తారంటూ వ్యాఖ్యానించారు.