ఎన్ఐఐటీ లాభం రూ.79 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్స్ అందించే ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.79 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. అమెరికా, బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగాల్లో భారీ వృద్ధి కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.18 కోట్ల నష్టం వచ్చిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ సీఈఓ అర్వింద్ ఠాకూర్ చెప్పారు. ఇక ఆదాయం రూ.611 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.685 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, దేశీయ వ్యాపారంపై దృష్టి తగ్గించామని, మార్జిన్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌లో 12 కోట్ల డాలర్ల విలువైన తాజా ఆర్డర్లను సాధించామన్నారు.