నీరవ్ మోదీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఒక్క వాలిడ్ పాస్‌పోర్టు మించి అతని దగ్గర ఇంకేమీ లేవవి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న రిపోర్టులను కొట్టిపారేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్, ఊహాగానాలకు చెక్ పెట్టాలని సూచించారు. ప్రతీసారి ముందస్తు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేసిన అనంతరమే, మోదీకి కొత్త పాస్‌పోర్టును జారీ చేసేవారమని తెలిపారు. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్ మోదీ గతవారం బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాలను సందర్శించినట్లు రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే.
నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు యూరోపియన్ దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. పాస్‌పోర్టుతో పాటు మూడు ముఖ్యమైన విషయాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఫిబ్రవరిలోనే మోదీ పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆల్‌ఇండియా మిషన్లకు ఆదేశించామని, ఇదే విషయాన్ని సంబంధిత దేశాలకు భారత రాయబారులు తెలిపారని చెప్పారు. రెండోది.. నీరవ్ మోదీని పట్టుకునేందుకు సహకరించాలని ఎంపిక చేసిన దేశాలకు తాజాగా లేఖలు రాసినట్టు తెలిపారు. వారి భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ వారి దేశంలో ఉన్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరినట్టు కూడా చెప్పారు.
ఇక మూడోది... ఏజెన్సీల నుంచి నీరవ్ మోదీని అప్పగించాలని ఎలాంటి అభ్యర్థన రాలేదని తెలిపారు. నీరవ్ అప్పగింత ప్రక్రియను చేపట్టాలని ముంబై కోర్టు ఈ వారంలో ఈడీకి అనుమతి జారీచేసింది. కానీ ఇప్పటి వరకు ఈడీ, విదేశాంగ శాఖను సంప్రదించలేదు. నీరవ్ ఎక్కడున్నారనే కచ్చితమైన ప్రదేశం తెలియకుండా.. మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనంతవరకు విదేశాల్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment