ముంబై : 5 కోట్ల రూపాయిల విలువైన రోల్స్ రాయిస్ కారు ముంబైలో కేవలం రూ 1.3 కోట్ల నుంచే అందుబాటులో ఉంది. పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి చెందిన 13 కార్లలో ఈ లగ్జరీ కారు ఒకటి కావడం గమనార్హం. ఈ 13 కార్లను ఈడీ ఆన్‌లైన్ వేలంలో విక్రయించనుఒంది. వేలం వేయనున్న నీరవ్ మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమెరా, రెండు మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఫార్చూనర్, ఇన్నోవా, రెండు హోండా బ్రియోస్‌లున్నాయి.
కాగా, రూ 13,000 కోట్ల విలువైన పీఎన్‌బీ స్కామ్ వెలుగుచూసిన అనంతరం స్వాధీనం చేసుకున్న నీరవ్ మోదీ కార్లను వేలం వేసేందుకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్ధానం ఈడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియలో భాగంగా బిడ్డర్లు ఈనెల 21 నుంచి 23 వరకూ ఆయా కార్లను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వారికి వాహనాలను టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లేందుకు మాత్రం అనుమతించలేదు. ఈ 13 వాహనాల ఫోటోలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులోనే వాహనం ప్రారంభ ధర, తనిఖీ చేసుకునే ప్రదేశం, రిజిస్ర్టేషన్ నెంబర్, మోడల్ వంటి వివరాలను పొందుపరిచారు. కాగా, అంతకుముందు నీరవ్ మోదీ పెయింటింగ్‌లను వేలం వేసిన ఈడీ రూ 54 కోట్లను సమకూర్చుకుంది. పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకోగా, ఆయనను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు ఏజెన్సీలు బ్రిటన్‌ను కోరుతున్నాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ అప్పీల్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment