ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణాల రూపంలో రూ.14,000 కోట్లకు పైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్‌మోదీకి చెందిన విలాస వస్తువులు వేలానికి రానున్నాయి. అరుదైన పెయింటింగ్‌లు, చేతి గడియారాలు, లగ్జరీ కార్లు ఇలా 112 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున ‘శాఫ్రోనార్ట్’ అనే సంస్థ వేలం వేయనుంది. వీటికి సంబంధించి మార్చి 5న ప్రత్యక్ష వేలం నిర్వహించనుంది. అలాగే, మరో 72 వస్తువులకు మార్చి 3, 4వ తేదీల్లో ఆన్‌లైన్ వేలం కూడా చేపట్టనుంది. తొలుత ప్రత్యక్ష వేలాన్ని ఈ నెల 27న నిర్వహించేందుకు నిర్ణయించగా, ఈడీ నుంచి వచ్చిన ఆదేశాలతో మార్చి 5కు మార్చినట్టు శాఫ్రోనార్ట్ స్పష్టం చేసింది.
విలువైన పెయింటింగ్‌లు..
♦ 1935నాటికి చెందిన అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ ‘బోయ్స్ విత్ లెమన్స్’’ అధికంగా రూ.12–18 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన 1972 నాటి పెయింటింగ్‌ను కూడా వేలం వేయనున్నారు. దీనికి కూడా దగ్గర దగ్గర ఇంతే ధర వస్తుందని భావిస్తున్నారు. అలాగే వీఎస్ గైతోండే, మంజిత్‌బవా, రాజా రవివర్మ పెయింటింగ్‌లను వేలంలో అందుబాటులో ఉంచనున్నారు.
♦ జాగర్ లీకోల్చర్ పురుషుల ‘రివర్స్ గైరోటర్బిల్లాన్ 2’ అనే లిమిటెడ్ ఎడిషన్ చేతి గడియారానికి రూ.70 లక్షలు వస్తుం దని అంచనా. పటేక్ ఫిలిప్ నాటిలస్ అనే బంగారం, వజ్రాల చేతి గడియారానికి కూడా రూ.70 లక్షలు లభిస్తుందని భావిస్తున్నారు.
♦ రోల్స్ రాయిస్ గోస్ట్ కారు రూ.95 లక్షలు పలుకుతుందని అంచనా. n బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగులను కూడా వేలంలో ఉంచనున్నారు. n ఇక మార్చి 3, 4న జరిగే వేలంలో పోర్షే ప్యానెమెరికా ఎస్ కార్ తదితర 72 వస్తువులను వేలానికి ఉంచనున్నట్టు శాఫ్రోనార్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment