నిస్సాన్ ‘మైక్రా’.. అప్‌డేటెడ్ వెర్షన్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు–రూ.6.95 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ.6.62 లక్షలు–రూ.7.23 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది.
‘జపానీస్ టెక్నాలజీతో యూరోపియన్ స్టైలింగ్‌లో తాజా కొత్త మైక్రాను తయారుచేశాం. ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉన్న ఒక ఉత్తమమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇది’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని వివరించారు. కొత్త మైక్రాలో ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.