
రిలయన్స్ ‘నీతా అంబానీ’ టాప్
ఆసియాలో శక్తివంతమైన వ్యాపార మహిళలు..
♦ రెండో స్థానంలో అరుంధతీ భట్టాచార్య
♦ ఫోర్బ్స్ జాబితాలో మరో ఆరుగురు
♦ భారతీయ మహిళలకు చోటు
న్యూయార్క్: ఫోర్బ్స్ ఆసియా ప్రాంతపు ‘అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళలు- 2016’ జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈమెతో సహా టాప్-50లో మొత్తంగా ఎనిమిది మంది భారతీయ మహిళలు స్థానం పొందారు. వీరిలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య (2వ స్థానం), మ్యూ సిగ్మా సీఈవో అంబిగా ధీరజ్ (14వ స్థానం), వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలి గోయెంకా (16వ స్థానం), లుపిన్ సీఈవో వినితా గుప్తా (18వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ (22వ స్థానం), వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ వ్యవస్థాపకురాలు, వైస్ చైర్మన్ వందన లుత్రా (26వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్, ఎండీ కిరణ్ మజుందార్ షా (28వ స్థానం) ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యంలో నీతా అంబానీ పాత్ర పెరగడం వల్ల ఆమె జాబితాలో స్థానం పొందారని ఫోర్బ్స్ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్న నీతా అంబానీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించనప్పటికీ ఆంతరంగీకులు ఈమెను రిలయన్స్ సింహాసనానికి చేరువలో ఉన్న వ్యక్తిగా పరిగణలోకి తీసుకుంటారని వివరించింది. స్పోర్ట్స్ విభాగంలోకి అడుగుపెట్టడం వల్ల ఆమెకు చాలా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. క్రికెట్ టీమ్ (ముంబై ఇండియన్స్) కోసం రిలయన్స్ దాదాపు 112 మిలియన్ డాలర్లను నీతా వెచ్చించారని ఫోర్బ్స్ తెలిపింది.
ఫోర్బ్స్ చెప్పింది ఇదీ....
ఎస్‌బీఐ మొండిబకాయిల పెరుగుదల కారణంగా అరుంధతీ భట్టాచార్య అత్యంత కఠినమైన సవాళ్లకు ఎదురీదుతూ బ్యాంకును నిర్వహిస్తున్నారు. డేటా అనలిటిక్స్ సేవలను అందించే ‘మ్యూ సిగ్మా’ సీఈవోగా అంబిగా ధీరజ్ ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కంపెనీ విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దిపాలి గోయెంకా.. ఈమె పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్ రంగంలోని వెల్‌స్పన్ ఇండియా కంపెనీ సీఈవోగా ఐదేళ్ల కిందట పదవీ బాధ్యతలు చేపట్టారు.
అప్పుడు ఆమె నియామకాన్ని చాలా మంది హేళన చేశారు. వారందరికీ సమాధానం చెబుతూ కంపెనీని వృద్ధి బాటలో నడిపిస్తున్నారు. దేశీ మూడో అతిపెద్ద ఫార్మా కంపెనీ లుపిన్‌ను నడిపిస్తున్నారు వినితా గుప్తా. అమెరికాకు చెందిన గావిస్ ఫార్మా కొనుగోలు ప్రక్రియ ఈమె నేతృత్వంలోనే జరిగింది. దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో చందా కొచర్‌లో మహిళా ఉద్యోగుల వాటాను పెంచడం కోసం ‘ఐవర్క్‌ఎట్‌హోమ్’ సహా పలు వినూత్నమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు.