
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన వ్యవస్థ నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) సంచలన నివేదికనువిడుదల చేసింది. భారతదేశం అత్యంత ఘోరమైన నీటి సంక్షోభంతో బాధపడుతోందని వ్యాఖ్యానించింది. దాదాపు 60 కోట్లమంది తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన నీటికి నోచుకోక ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది మరణిస్తున్నారంటూ నితీ ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ) పేరిట గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. అంతేకాదు భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నీటి కొరత సమీప భవిష్యత్తులో రానుందని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. 2030 నాటికి నీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేసింది. నీటి వనరుల రక్షణ, వాడుకపై అవగాహన పెంచుకోవాల్సిన తక్షణ సమయమిదని నొక్కి చెప్పింది.
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి రానుందని నీటి వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదికలో తెలిపారు. నీటి నిర్వహణ చాలా పెద్ద సమస్యగా ఉందని, అయితే వ్యవసాయ రంగాలలో కొన్నిరాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయని గడ్కరీ అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మరియు నీటి నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు , ఢిల్లీ ముఖ్యమంత్రితో సమావేశంకానున్నామని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశంలో నీటి సరఫరాకు డిమాండ్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. దేశం జీడీపీ 6 శాతం నష్టపోతుందని పేర్కొన్నారు.
అయితే 2015-16 పరిస్థితులతో పోలిస్తే, 2016-17 సంవత్సరానికిగాను నీటి నిర్వహణ విషయంలో గుజరాత్ ముందు వరుసలో ఉందనీ, ఆ తరువాత మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు జార్ఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. హిమాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, త్రిపురలో నీటి లభ్యత బాగుందని, ఆపై హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం రాష్ట్రాలున్నాయని తెలిపింది. నీటి కొరతకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు కూడా కారణం అవుతున్నాయని, ముఖ్యమైన ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని సూచించింది. స్వతంత్ర సంస్థల నివేదికను ఉదాహరించిన నీతి ఆయోగ్ దేశంలో దాదాపు 70 శాతం నీరు కలుషితమైందని, నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో భారత దేశం 120 వ స్థానంలో ఉందని నీతి అయోగ్ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment