ఆ నోట్లు ఇక చెల్లవు
ముంబై : పాత కరెన్సీ నోట్లను మార్చుకునే గడువు నేటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి(శుక్రవారం) నుంచి 2005 ముందు ముద్రించిన నోట్లను మార్చుకునే అవకాశం లేదని ఆర్ బీఐ ప్రకటించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్ బీఐ గతంలోనే తెలిపింది. ఆ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి అంతే విలువ చేసే కొత్త నోట్లను పొందేందుకు గతేడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ప్రీ-2005 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్ బీఐ చేపట్టింది.
చాలా శాతం వరకూ ఈ నోట్లను వెనక్కి తీసుకున్నామని, ఇంకా కొంత శాతం మాత్రమే చెలామణిలో ఉందని ఆర్ బీఐ గురువారం పేర్కొంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రీ-2005 నోట్లను మార్చుకోవాలంటే ఆర్ బీఐకు సంబంధించిన 20 ఆఫీసులను ఆశ్రయించాల్సి ఉందని తెలిపింది. ఆర్ బీఐ ఆఫీసులు.. అహ్మదాబాద్, బెంగళూరు, బెల్లాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీఘర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లోనే ఇక ఇప్పటినుంచి 2005 ముందటి నోట్లను మార్చుకునే అవకాశముంటుందని ఆర్ బీఐ ఓ ప్రకటన వెల్లడించింది.
ఈ ప్రక్రియతో నేటి నుంచి 2005కు ముందటి నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావు. ఈ నోట్లను గుర్తించడం చాలా సులువు. 2005కు తర్వాత ప్రింట్ చేసిన కరెన్సీకి వెనుకవైపు కింది భాగంలో ముద్రించిన ఏడాది వివరాలు ఉంటాయి. అదే 2005కు ముందు నోట్లలో ఈ వివరాలుండవు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, నకిలీ నోట్లను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2005కు తర్వాత ముద్రించిన కరెన్సీతో పోలిస్తే పాత నోట్లలో భద్రత ఫీచర్లు తక్కువని పేర్కొంది.