పాత ఆభరణాలు, కార్ల అమ్మకాలపై నో జీఎస్‌టీ
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా అమ్ముకునే పాత బంగారం ఆభరణాలు, కార్లపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు కాబోదని ఆదాయపు పన్ను శాఖ గురువారం వివరణ ఇచ్చింది. ఆయా అమ్మకాలు వ్యాపారం చేయటానికి కాదు కనక జీఎస్‌టీ అమలు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, సెంట్రల్ జీఎస్‌టీ యాక్ట్‌లోని సెక్షన్ 9 (4) పాత ఆభరణాల వ్యక్తిగత అమ్మకాలు జీఎస్‌టీ పన్ను పరిధిలోకి ఎంతమాత్రం రావని వివరించింది. కార్లు, ద్విచక్ర వాహనాలకూ ఇదే వర్తిస్తుందని పేర్కొంది.
రివర్స్ చార్జ్ విధానం గురించి వివరిస్తూ, పన్ను విధించాల్సిన వస్తువుల సరఫరాల (ఉదాహరణకు బంగారం) అంశానికి సంబంధించి రిజిస్టర్‌కాని సరఫరాదారు (వ్యక్తిగతంగా) ఒక రిజిస్టర్ అయిన వ్యక్తికి (జ్యూయెలర్) విక్రయాలు జరిపితే, రిజిస్టర్డ్ పర్సన్ పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ, అయితే వ్యాపార ప్రయోజనం నిమిత్తం ఆయా వాణిజ్య లావాదేవీ జరగకపోతే, పన్ను వర్తించబోదని తెలిపింది. అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ విషయంలో ఆభరణాలు రిజిస్టర్డ్ సప్లయర్‌కు అమ్మినా జీఎస్‌టీ వర్తిస్తుందని పేర్కొంది.