
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు సంబంధించి ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ఇచ్చే బ్యాంక్ గ్యారంటీలను తీసుకోబోమని టెలికం శాఖ (డాట్) స్పష్టం చేసింది. గతంలో ఎయిర్‌సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలను చెల్లించడంలో యాక్సిస్ విఫలం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది.
ఇది భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోరాదని మార్చి 16న జారీ చేసిన ఆఫీస్ మెమోలో టెలికం శాఖ తెలిపింది. మరోవైపు, తాము భారతి ఎయిర్‌టెల్ తరఫున మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరిపిన పక్షంలో టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ టీడీశాట్ ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుందని, అందుకే జరపలేదని వివరించాయి. టీడీశాట్ ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో నిబంధనలకు అనుగుణంగా సదరు గ్యారంటీలకు సంబంధించి చెల్లింపులు జరుపుతామని తెలిపాయి.
వాస్తవానికి ఎయిర్‌సెల్ స్పెక్ట్రంను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారతి ఎయిర్‌టెల్ తరఫున బ్యాంక్ గ్యారంటీని ఇచ్చినట్లు యాక్సిస్ వర్గాలు వివరించాయి. అయితే, ఎయిర్‌సెల్, టెలికం శాఖల మధ్య వివాదంలో టీడీశాట్ ఉత్తర్వులవల్ల బ్యాంక్ గ్యారంటీ చెల్లింపులను జరిపేందుకు యాక్సిస్‌కు వీలు లేకుండా పోయిందని వివరించాయి. కాంట్రాక్టుల నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన టెలికం కంపెనీలు గానీ డిఫాల్ట్ అయిన పక్షంలో ప్రభుత్వం పెనాల్టీ కింద ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment