
పీఎన్‌బీ స్కామ్‌లో ఈడీ నోటీసులపై బదులివ్వని నిందితులు
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కామ్‌లో అక్రమ లావాదేవీలు చేపట్టిన నిందితుడు నీరవ్ మోదీకి ఈడీ జారీ చేసిన సమన్లపై ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం రాలేదు. ఈ స్కామ్ సూత్రధారి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, ఇతర నిందితులు మెహుల్ చోక్సీల నుంచి సమన్లపై ఎలాంటి ప్రతిస్పందనా రాలేదని ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు అప్పటి పీఎన్‌బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టికి ఎందుకు ప్రమోషన్ లభించలేదు..అదే పోస్టులో దీర్ఘకాలం కొనసాగారన్న దిశగా విచారణ సాగిస్తున్నట్టు వెల్లడించాయి.
ఈ కేసుకు సంబంధించి శెట్టితో పాటు మరో ఇద్దరు బ్యాంకు అధికారులను శనివారం అరెస్ట్ చేశారు. కాగా, నీరవ్ మోదీ సంస్థకు అనుకూలంగా మార్చి 2011లో తొలి హామీ పత్రం (ఎల్‌ఓయూ) జారీ చేసినట్టు తెలిసింది. ఎల్‌ఓయూ జారీ చేసిన ప్రతిసారీ మంజూరైన మొత్తాన్ని బట్టి పర్సెంటేజ్‌లు అందేవని అరెస్ట్ అయిన బ్యాంకు అధికారుల విచారణలో వెల్లడైంది.
ఎల్‌ఓయూల జారీపై ముట్టిన కమీషన్‌ను ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న పీఎన్‌బీ ఉద్యోగులందరికీ పంపిణీ చేసేవారని తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి నీరవ్ మోదీ,గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీలకు మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సమన్లు జారీ చేశారు. వారంలోగా తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితులైన ఇద్దరు వ్యాపారవేత్తలు దేశం విడిచివెళ్లడంతో ఆయా కంపెనీల డైరెక్టర్లకు నోటీసులను అందించారు.