30% వృద్ధిపై నోబెల్ హైజీన్ దృష్టి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టర్నోవరులో సుమారు 30 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు డైపర్ల తయారీ సంస్థ నోబెల్ హైజీన్ ఎండీ కమల్ కుమార్ జొహారీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవరు సుమారు రూ. 150 కోట్ల మేర నమోదైందని పేర్కొన్నారు. పెద్దల డైపర్ల విభాగంలో తమకు దాదాపు దాదాపు 65 శాతం, పిల్లల డైపర్ల విభాగంలో 5-6 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు.
బుధవారమిక్కడ ‘టెడ్డీ’ పేరిట ప్యాంట్ తరహా డైపర్లను ఆవిష్కరించిన సందర్భంగా జొహారీ ఈ విషయాలు వివరించారు. పిల్లల డైపర్లు ధరలు సుమారు రూ. 9 నుంచి, పెద్దలవి రూ. 40 నుంచి ఉన్నాయని చెప్పారు. డైపర్ల తయారీలో ఉపయోగించే ముడివస్తువుల దిగుమతులపై సుంకాలు ఏకంగా 25 శాతం మేర ఉండగా, పూర్తి స్థాయి ఉత్పత్తులపై 15 శాతమే ఉండటం వంటి అంశాలు దేశీయంగా వీటి తయారీకి ప్రతికూలంగా మారాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, దేశీ సంస్థలకు తోడ్పాటునివ్వాలని జొహారీ కోరారు.