నోకియా 3310ను ఆవిష్కరిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్ సీఈఓ ఆర్టో నుమేల
⇒ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి...
⇒ మార్కెట్‌లోకి నోకియా–3310 రీఎంట్రీ
⇒ పలు ఆండ్రాయిడ్ ఫోన్ల ఆవిష్కరణ
⇒ ధర శ్రేణి రూ.3,500–రూ.16,000
బార్సిలోనా: నోకియాను చూస్తే పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలనే సామెత గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఐకానిక్ ‘నోకియా–3310’ మళ్లీ భారత్ మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది వచ్చే త్రైమాసికంలో భారతీయులకు అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌కు సంబంధించి నోకియాతో పదేళ్ల వరకు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ ఫోన్లను భారత్‌లో విక్రయించనుంది.
ఇది నోకియా–3310 ఫోన్‌తోపాటు నోకియా–6, నోకియా–5, నోకియా–3 వంటి ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా ఆవిష్కరించింది. ‘మేం ప్రకటించిన నోకియా ప్రొడక్టులన్నీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. నోకియా–3310 అంతర్జాతీయ విక్రయ ధర సగటున 49 యూరోలు (దాదాపు రూ.3,500)’ అని హెచ్‌ఎండీ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పెకా రంటల తెలిపారు.
ఇవి ప్రత్యేకతలు..: నోకియా–3310 ఫోన్‌లో 2.4 అంగుళాల స్క్రీన్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 ఎంపీ కెమెరా, బ్లూటూత్, 2జీ, యూఎస్‌బీ కనెక్టివిటీ, 16 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ వరకు మెమరీ కార్డు సపోర్ట్, 1,200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. నాలుగు రంగుల్లో లభ్యంకానున్న ఈ ఫోన్‌ను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 22 గంటలపాటు మాట్లాడుకోవచ్చని తెలిపింది. ఫోన్‌లో క్లాసిక్ స్నేక్ గేమ్‌ను డీఫాల్ట్‌గా అందిస్తున్నామని పేర్కొంది.
నోకియా–3310కి ప్రత్యేక గుర్తింపు
2000–05 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫీచర్ ఫోన్‌గా నోకియా–3310కి గుర్తింపు ఉంది. మొబైల్ నెట్‌వర్క్ అన్ని దేశాలకు పూర్తిగా విస్తరించని కాలంలోనే వీటి విక్రయాలు 12.6 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. 2005 నుంచి ఈ మోడల్ మార్కెట్‌లోకి రాలేదు. కాగా నోకియా తన హ్యాండ్‌సెట్స్ బిజినెస్‌ను 2013లో మైక్రోసాఫ్ట్‌కి 7 బిలియన్ డాలర్లకి విక్రయించింది. తర్వాత హెఎండీ గ్లోబల్ ఈ నోకియా బ్రాండ్‌ని లీజ్‌కు తీసుకుంది.
మరో మూడు స్మార్ట్‌ఫోన్లు కూడా..
హెచ్‌ఎండీ గ్లోబల్ మరో మూడు నోకియా స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఇవి కూడా వచ్చే త్రైమాసికం నుంచి లభ్యమవుతాయి. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న ఈ నోకియా–6 స్మార్ట్‌ఫోన్ ధర దాదాపుగా రూ.16,000గా ఉంది. ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్న నోకియా–3 స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.9,800. 5.2 అంగుళాల స్క్రీన్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్న నోకియా–5 ధర దాదాపు రూ.13,500.