నోకియాలో ఉద్యోగాల కోత
వ్యయాల తగ్గించుకోవడానికి టెలికాం దిగ్గజం నోకియా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఫ్రాన్స్‌లో దాదాపు 600 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నోకియా తెలిపింది. ఈ ఉద్యోగాల కోతతో పాటు నష్టాల్లో ఉన్న వ్యాపారాలపై కూడా పునర్ దృష్టిసారించాలని చూస్తున్నట్టు పేర్కొంది. ఫ్రాన్స్‌లో 597 మంది ఉద్యోగులను తగ్గించాలని ప్లాన్ చేస్తున్నామని, మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతమని గ్రూప్ తెలిపింది. నోకియా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రెంచ్ ట్రేడ్ యూనియన్లు సీఎఫ్‌డీటీ, సీఎఫ్‌ఈ-సీజీసీ, సీజీటీ, సీఎఫ్‌టీసీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.. ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద తమ గోడును వెల్లబుచ్చుకోనున్నట్టు తెలిపాయి. సమస్యను పర్యవేక్షించడానికి యూనియన్, సంస్థ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేశామని, మరికొన్ని వారాల్లో కమిటీని సమావేశపరచబోతున్నట్టు ఆ దేశ మంత్రిత్వశాఖ తెలిపింది.
అల్కాటెల్-లుసెంట్ ఇంటర్నేషనల్, నోకియా సొల్యూషన్స్ నెట్‌వర్క్స్ ఫ్రాన్స్‌లలో ఈ ఉద్యోగాల కోత ఉండబోతుంది. వీటిలో మొత్తంగా 4200 మంది ఉద్యోగులున్నారని నోకియా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఉద్యోగాల కోత ప్లాన్ నుంచి ఆర్ అండ్ బీ కార్యకలాపాలను మినహాయించారు. హైస్పీడు 5జీ టెలికాం నెట్‌వర్క్స్, సైబర్ సెక్యురిటీ, ఇంటర్నెట్‌తో లింక్ అయిన అప్లియన్స్‌లపై కంపెనీ పునః దృష్టిసారించాలని చూస్తుందని గ్రూప్ తెలిపింది. 2018 చివరి వరకు మొత్తం వ్యయాల్లో 1.4 బిలియన్ డాలర్లను పొదుపు చేసుకోవాలని నోకియా లక్ష్యంగా పెట్టుకుంది.