బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్‌ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్‌సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది.