
ఎలక్ట్రిక్ కార్లలో దూసుకుపోతున్న నార్వే
ఒస్లో: జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రపంచంలోకెల్లా నార్వే దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఆ దేశంలో 52 లక్షల మంది జనాభా ఉండగా, వారు లక్షకు పైగా ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల వినియోగంలో నార్వే అతి వేగంగా దూసుకెళుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సగానికిపైగా ఈ కార్లే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు 17.6 శాతం రిజస్టర్ అవగా, హైబ్రీడ్ కార్లు 33.8 శాతం రిజిస్టర్ అయ్యాయి. అంటే మొత్తం కార్ల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల సంఖ్యనే 51. 4 శాతం ఉందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలియజేసింది.
2030 నాటికి వాతావరణంలో కార్బన ఉద్గారాలను 40 శాతం తగ్గించాల్సి ఉందని, అందుకనే తమ దేశం ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వాతావరణం, పర్యావరణశాఖల మంత్రి విదార్ హెల్గేసన్ తెలిపారు. 1990 నుంచే ఈ కార్లను ప్రోత్సహించేందుకు నార్వే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిపై అమ్మకం, రోడ్డు పన్నులను మినహాయించింది. టోల్ గేట్ల వద్ద, షిప్పుల్లో ఉచిత ప్రవేశం కల్పించింది. అన్ని చోట్ల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు బస్సుల కోసం కేటాయించిన ప్రత్యేక ట్రాక్‌లపై వెళ్లేందుకు అనుమతించింది.
ప్రపంచంలోకెల్లా అతివేగంగా ఎలక్ట్రిక్ కార్లను చార్జిచేసే అతిపెద్ద స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఒక్క అరగంటలో 28ను కార్లను ఏకకాలంలో చార్జింగ్ చేసే సామర్థ్యం ఈ స్టేషన్‌కు ఉంది. 2025 సంవత్సరం నాటికి దేశంలో ఒక్క శిలాజ ఇంధనాలపై పనిచేసే వాహనాలను నిర్మూలించేందుకు నార్వే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2030 నుంచి పెట్రోలు, డీజిల్ కార్లను పూర్తిగా నిర్మూలించాలన్నది నార్వే లక్ష్యం. జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకోకపోయినట్లయితే ప్రపంచంలోకెల్లా చైనాలో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా ఉన్నాయి.