సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పుపై దేశప్రజల్లో ఆసక్తి సహజమే అయినా అంతర్జాతీయంగానూ గుజరాత్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చైనా గుజరాత్ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మన ఎన్నికల ఫలితాలపై చైనాకు ఎందుకంత క్రేజ్ అంటే చైనా సొంత ప్రయోజనాలు ఈ ఎన్నికలతో ముడిపడటమే.
భారత్‌లో పెరుగుతున్న చైనా పెట్టుబడుల నేపథ్యంలో గుజరాత్ మోడల్‌కు, మోదీ విధానాలకు పరీక్షగా ఈ ఎన్నికలను చైనా భావిస్తోంది. బీజేపీ భారీ ఆధిక్యంతో గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు జనామోదం లభించినట్టు చైనా భావిస్తోంది. అదే సమయంలో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ గట్టెక్కినా, ఓటమి పాలైనా సంస్కరణలపై మోదీ సర్కార్ ముందుకెళ్లడంపై సందేహాలు అలుముకుంటాయని అంచనా వేస్తోంది.
భారత్‌లో చైనా కంపెనీల పెట్టుబడులు పెరుగుతుండటంతోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణల పట్ల చైనా అమితాసక్తి కనబరుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు మోదీ సంస్కరణల అజెండాపై పెను ప్రభావం చూపుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసింది. 2015తో పోలిస్తే 2016లో భారత్‌లో చైనా పెట్టుబడులు పలు రెట్లు అధికమని, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిస్తే మోదీ యంత్రాంగం ఆర్థిక సంస్కరణలపై మరింత దూకుడుగా ముందుకెళుతుందని పేర్కొంది.
గుజరాత్‌లో బీజేపీ ఓటమి పాలైతే మాత్రం ఆర్థిక సంస్కరణలపై మోదీ వైఖరిపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక మార్కెట్లలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment