టెక్ దిగ్గజం ఇన్ఫీలో మళ్లీ 'ప్యాకేజీ' రగడ
టెక్ దిగ్గజం ఇన్ఫీలో మళ్లీ 'ప్యాకేజీ' రగడ
Published Mon, Apr 3 2017 8:38 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రాజుకున్న ప్యాకేజీ రగడ ఇంకా సద్దుమణగలేదు. మరోసారి ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాలపై కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఈ సారి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు పెంచిన పరిహారాలపై ఆయన మండిపడ్డారు. టాప్-లెవల్ వ్యక్తులకు పెంచే పరిహారాలు, ఇతర ఉద్యోగులకు పెంచే వేతనాలు సరిగ్గా లేవని ఉద్దేశిస్తూ నారాయణమూర్తి ఆదివారం ఓ లేఖ రాశారు.
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు వేతన పెంపు విషయంలో జరిగిన ప్రమోటర్ల ఓటింగ్ ఫలితాల అనంతరం నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అయితే యూబీ ప్రవీణ్ రావుకు వేతనం పెంచడానికి కేవలం 24 శాతం ప్రమోటర్లు మాత్రమే అంగీకారం తెలిపారు. మిగతావారు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ కు ఆదివారం సమర్పించిన పోస్టల్ బ్యాలెట్లో ఫలితాల్లో వెల్లడైంది.
రావుకు వార్షికంగా స్థిర పరిహారాల కింద రూ.4.62 కోట్లు, వేరియబుల్ పరిహారాల కింద రూ.3.88 కోట్లు చెల్లించాలని కంపెనీ నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ గత అక్టోబర్ లో ప్రకటించింది. ఫిబ్రవరి 23న దీనిపై ఓటింగ్ వచ్చింది. శుక్రవారంతో ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఓటింగ్ ప్రక్రియపైన మూర్తి ఆదివారం స్పందిస్తూ...'' కంపెనీలో చాలామంది వ్యక్తులకు పరిహారాలు కేవలం 6 శాతం నుంచి 8 శాతం పెంచుతున్నప్పుడు టాప్ -లెవల్ వ్యక్తులకు 60 శాతం నుంచి 70 శాతం పరిహారాలు పెంచుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది అనైతికం'' అని బోర్డుకు చురకలంటించారు.
ఇది కంపెనీ మేనేజ్మెంట్, బోర్డులపై ఉద్యోగులకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని హరిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో డీఎన్ ప్రహ్లాద్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించేందుకు ఓటింగ్ వేయాలని కోరింది. కంపెనీ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ పెంపు విషయంలో కూడా వ్యవస్థాపకులు బోర్డు సభ్యుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement