సీవోవో గణపతితో సీఈవో కృతివాసన్(ఎడమ)
క్యూ4లో నికర లాభం రూ. 12,434 కోట్లు
2023–24 లాభం రూ. 45,908 కోట్లు
షేరుకి రూ. 28 డివిడెండ్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం.
త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్‌లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
పూర్తి ఏడాదిలో..
గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్‌లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది.
దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది.
ఇతర విశేషాలు
► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది.
► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది.
► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్‌ను సాధించింది.
► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది.
► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది.
► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు.
► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది.
అనిశ్చితిలోనూ
లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం.
– కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్
Comments
Please login to add a commentAdd a comment