
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్‌ఎస్‌ఈ వెబ్ పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్’ పేరిట రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధి) ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది.
‘‘దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిన తరుణంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ తీసుకురావడం కీలక మైలురాయిగా భావిస్తున్నాం. నాన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసేందుకు సెబీ స్టాక్ ఎక్సేంజ్‌లను అనుమతించాకే... ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనడం ప్రారంభమైంది’’ అని అజయ్‌త్యాగి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆఫర్ చేసే రాబడుల కంటే ప్రభుత్వ బాండ్లు మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు చెప్పారు.
రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం ప్రస్తుతం తక్కువగా ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 7.80– 7.83 శాతం మధ్య ఉంది.