దిగివస్తున్న బంగారం ధరలు
ముంబయి : స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపుతుంటే మరోవైపు బంగారం ధర తిరోగమనంలో పయనిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1268 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది 10 వారాల కనిష్ఠ స్థాయి. ఎంసీక్స్లో బంగారం ధర 27,600లకు పడింది. బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే స్టాక్ మార్కెట్లో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
దాంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడి 67 శాతం తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల వార్తలు వస్తుండటంతో డాలర్ బలపడుతోంది. ఈ ప్రభావం.. బంగారంపై ప్రతికూలంగా పడుతోంది. ఇరాక్, లిబియా, ఉక్రెయిన్‌లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచం ఈ దేశాల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదని మదుపుదారులు భావిస్తున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి కారణమవుతోంది.