బంగారం ధరలో రికవరీ
ముంబై: దేశీయంగా దాదాపు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయిన బంగారం ధరలు శనివారం తిరిగి కొంచెం కోలుకున్నాయి. ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి, రూ.26,100కు చేరింది. 22 క్యారెట్ల విషయంలోనూ ధర ఇంతే మొత్తం ఎగసి రూ.25,950కు ఎగసింది. వెండి కేజీ ధర సైతం రూ.750 పెరిగి తిరిగి రూ.36,000ను తాకింది.
వడ్డీరేట్లపై అనిశ్చితితో అంతర్జాతీయంగా, దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధరల ధోరణి ఇంకా సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ దేశ ప్రధాన స్పాట్ మార్కెట్‌లో ధర పెరగడం విశేషం. పెళ్లిళ్ల సీజన్‌లో రిటైల్ ఆభరణాలకు డిమాండ్, ప్రస్తుత స్థాయిలో ధర వద్ద పెట్టుబడులకు ఎల్లో మెటల్ సరైనదన్న అభిప్రాయం తిరిగి దేశీయంగా పసిడి ధర పెరగడానికి కారణమని నిపుణుల విశ్లేషణ.