
కేపీహెచ్‌బీకాలనీ: ప్రముఖ మొబైల్ ఫోన్ ఉత్పత్తి సంస్థ వన్ ప్లస్ మొదటిసారిగా ఆఫ్‌లైన్ విక్రయాలలో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కూకట్‌పల్లి సుజనా ఫోరమ్ మాల్‌లో గల బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇవో కరన్ బజాజ్‌లు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ఆన్ లైన్ విక్రయాల్లో వన్ ప్లస్ ఇండియా 50శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుందన్నారు. ఆఫ్‌లైన్ విక్రయాల్లో 35 శాతం కలిగి ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లు బ్రాండ్‌లు, ధరలు రెండు కూడా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. వన్ ప్లస్ స్థాపించిన ఐదేళ్ళలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం ఫోన్ల విక్రయాల్లో 4వ అతి పెద్ద బ్రాండ్‌గా ఎదిగిందన్నారు. కరణ్‌బజాజ్ మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో 54 స్టోర్‌లలోవన్‌ప్లస్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.