
సాక్షి, పుణే: ఉల్లి పంట రైతు కంట మరోసారి కన్నీరు పెట్టిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో 50పైసలకు పడిపోయింది. పుణే మార్కెట్‌లో 2018 రబీ సీజన్లో ఉంచిన ఉల్లి ధర దారుణంగా పడిపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తమ వద్ద నిలువ ఉన్న పాత ఉల్లిని కిలో 50పైసల చొప్పున తెగనమ్ముకుంటున్నారు. సాధారంగా డిసెంబర్ నాటికి పాత ఉల్లిని విక్రయిస్తారనీ. అయితే.. ఈ ఏడాది ఉల్లి ఇంకా మార్కెట్ కి వస్తోందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వెల్లడించింది. దాదాపు 220 లక్షల టన్నుల ఉల్లి మార్కెట్‌ను ముంచెత్తిందనీ, గతంతో పోలిస్తే ఇది 40 లక్షల టన్నులు అధికమని కమిటీ తెలిపింది. ఇపుడు రోజుకు కనీసం 30 నుంచి 40 టన్నుల ఉల్లి మార్కెట్ వస్తోందని పేర్కొంది.
మరోవైపు పండించిన 40 టన్నుల ఉల్లిలో ఇంకా 20 టన్నులు ఇంకా తన వద్దే ఉందని అహ్మద్నగర్ కు చెందిన శివాజీ గూలే అనే రైతు వాపోయారు. ఎకరాకు 10 టన్నుల ఉల్లి పండించామని తెలిపారు. ఇక పంట పండించేందుకు ఎకరానికి రూ.30 వేల ఖర్చుతోపాటు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.50వేలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొనేవారు కరువవ్వడంతోపాటు, రవాణా ఖర్చులు భరించలేక దాదాపు 55 బస్తాల ఉల్లిని మార్కెట్ యార్డ్‌లోనే వదిలివేశానని మరో రైతు వాపోయారు.
కాగా ఉల్లి పంటకు పెట్టింది పేరైన నాసిక్‌లో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈ ఏడాదిలో గత 20 రోజుల్లో 18 మంది రైతులు ఆత్మహత్మకు పాల్పడ్డం ఇందుకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment