ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌! | Online Food Quality Is Deteriorating | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నాసిరకం ఆహారం!

Published Sat, Jul 27 2019 4:27 PM | Last Updated on Sat, Jul 27 2019 4:33 PM

Online Food Quality Is Deteriorating - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జొమాటో, స్విగ్గీ, ఊబర్‌ ఈట్స్‌..అన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థలు కొన్ని వేల రెస్టారెంట్లను మన మునివేళ్ల ముందుకు తీసుకొచ్చాయి. వీటిలో ఏ రెస్టారెంట్‌ నుంచి ఆహారం కావాలన్నా అరగంటలో మన కళ్ల ముందుంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకుంటున్న ఆహారంలో క్రమంగా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయని, రెస్టారెంట్లో సరఫరా చేస్తున్న నాణ్యత కన్నా...ఆర్డర్‌ ద్వారా తెప్పించుకున్న ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటుందని మెజారిటీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పేరెన్నికగన్న రెస్టారెంట్లే కాకుండా చిన్న చిన్న ఆహారం కొట్లు కూడా ‘యాప్స్‌’ పరిధిలోకి వస్తున్నాయని, వాటిలో పరిశుభ్రత సరిగ్గా ఉండదని ఆరోపిస్తున్నారు. ఎప్పటికీ తాము పరిమాణంకన్నా నాణ్యతా ప్రమాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఎక్కువ మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారని ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సామాజిక వేదిక ఆన్‌లైన్‌ ఆహారంపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 

నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని 66 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడగా, సకాలంలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తామని 22 శాతం మంది, ప్యాకింగ్, రవాణా సందర్భంగా ఆహారం నాణ్యత పడిపోతోందని 53 శాతం మంది, రెస్టారెంట్‌లో ఉన్నట్లే ఆన్‌లైన్‌ ద్వారా తాము అందుకున్న ఆహారం ఉంటుందని 30 శాతం మంది, క్రమంగా నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని 17 శాతం మంది అభిప్రాయపడగా, ధరలు అధిక ధరలు వసూలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 218 జిల్లాల పరిధిలో 27 వేల మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. స్టార్టప్‌ కంపెనీలు ఏవైనా మార్కెట్‌ విస్తరణ, వద్ధిపైనే ముందుగా దృష్టిని సారిస్తాయని, అందుకనే నాణ్యతా ప్రమాణాలు పెద్దగా పట్టించుకోవని ఓ స్టార్టప్‌ కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ స్వతంత్ర విశ్లేషకుడు హెచ్‌వీ హరీష్‌ తెలిపారు. మార్కెట్‌పై పట్టు సాధించాక ఆపరేషన్లు, వినియోగదారుల సంతప్తిపై దృష్టిని సారిస్తారని చెప్పారు. 

రెస్టారెంట్లు, వినియగదారుల మధ్యనున్న దూరాన్నే తగ్గించడం కోసమే ప్రస్తుతం ఈ యాప్స్‌ వచ్చాయని, అందులో చాలా వరకు విజయం సాధించాయని, ఇక నాణ్యతా ప్రమాణాలపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘టెక్‌సై రీసర్డ్‌’ సంస్థ కన్సల్టెంట్‌ సుకతీ సేథ్‌ వ్యాఖ్యానించారు. ప్యాకేజ్‌ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కొన్ని రెస్టారెంట్లకు జొమాటో స్వయంగా ప్యాకేజీ కవర్లను పంపిణీ చేస్తోందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అది విస్తరించే ప్యాకింగ్‌ సందర్భంగా ఆహారం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు అంటున్నాయి. ప్యాకేజీ మధ్యలో ఆహారం మారటం చాలా అరుదని, రెస్టారెంట్లే ప్యాకేజీ ఆహారానికి సరైన ప్రమాణాలను పాటించడం లేదని స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమైనా ఇక నుంచి తాము కూడా ఆహారం నాణ్యతపై దష్టిని కేంద్రీకరిస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement