ఆర్డర్ డెలివరీకి బైకులు కావాలా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి.
స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం...
ఈ రోజుల్లో ఆన్‌లైన్ సంస్థలకు కొదవ లేదు. ఆన్‌లైన్లో ఆర్డర్ తీసుకోవటమనేది ప్రతి సంస్థా చేస్తోంది. కాకపోతే తీసుకున్న ఆర్డర్‌ను డెలివరీ చేయటమే అసలైన సమస్య. ఎందుకంటే డెలివరీ కోసం ప్రతి సంస్థకూ సొంత లాజిస్టిక్స్ విభాగం ఉండాలి. లేకపోతే వేరొక లాజిస్టిక్స్ కంపెనీపై ఆధారపడాలి. దీన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు కిరణ్‌కుమార్ రెడ్డి.
కార్ల అగ్రిగేటర్ ఉబెర్‌ను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ కేంద్రంగా బైకులకు అగ్రిగేటర్‌గా ఈ ఏడాది జులైలో సెండ్‌ఫాస్ట్.ఇన్‌ను ఆరంభించాడు. దీనికి సంబంధించి కిరణ్‌కుమార్ ఏమంటారంటే... ‘‘స్థానికంగా ఉన్న ఫార్మసీ దుకాణాలు, రెస్టారెంట్లు, గ్రోసరీ సంస్థల వద్ద మా సెండ్‌ఫాస్ట్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్‌లో సరకులను ఎక్కడికి డెలివరీ చేయాలన్నది నమోదు చేస్తే చాలు. అందుబాటులో ఉన్న బైకర్ల వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. వారికి కావాల్సిన బైకర్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఇందుకుగాను 5 కి.మీ. వరకు రూ.35, ఆ తర్వాత ప్రతి కి.మీ. మీద రూ.9 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ తాలుకు వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం.
సెండ్‌ఫాస్ట్‌లో బైక్‌ను రిజిస్టర్ చేసిన వారికి నెలకు రూ.11 వేలు వేతనంగా అందిస్తున్నాం. ప్రస్తుతం రెండు నగరాల్లో కలిపి నెలకు 7,000 మంది మా అప్లికేషన్‌ను వినియోగించుకుంటున్నారు. రోజుకు 500 ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇటీవలే లాంటెక్ ఫార్మా కంపెనీ యజమాని ప్రకాశ్ రెడ్డి మా సంస్థలో రూ.15 లక్షల పెట్టుబడులు పెట్టారు. విస్తరణ బాటలో పయనిస్తున్నాం..’’
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...