డిపాజిట్లపై ఓబీసీ వడ్డీరేట్ల తగ్గింపు
♦ పావు నుంచి అరశాతం శ్రేణిలో కోత
♦ సోమవారం నుంచీ అమలు...
న్యూఢిల్లీ: కోటి రూపాయలలోపు డిపాజిట్ల విషయంలో పలు కాలపరిమితులకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించినట్లు ప్రభుత్వరంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. మార్చి 28వ తేదీ (సోమవారం) నుంచీ తగ్గించిన డిపాజిట్ రేట్లు అమల్లోకి వస్తాయని బీఎస్‌బీకి సమర్పించిన ఒక నోట్‌లో తెలిపింది. పలు మెచ్యూరిటీలపై పావుశాతం నుంచి అరశాతం మేర వడ్డీరేట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై కేంద్రం భారీగా వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో... రేటు కోత నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఓబీసీ నిలవడం గమనార్హం. రేటు కోత తీరును చూస్తే...
ఏడాదిలోపు అర... ఆపై పావు..
♦ 31 రోజుల నుంచి 45 రోజుల మధ్య డిపాజిట్ రేటు 5% నుంచి 5.5%కి దిగింది.
♦ 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య డిపాజిట్ రేటు అరశాతం తగ్గి 6 శాతానికి పడింది.
♦ 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య రేటుఅరశాతం తగ్గి 6.25కు చేరింది.
♦ ఏడాది నుంచి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్ల రేటు 7.75% నుంచి 7.5 శాతానికి తగ్గింది.
♦ 2-10 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లపై రేటు కూడా ఇంతే తగ్గి 7.25%కి చేరింది.