ఆర్థిక, టెలికం శాఖలకు పీఏసీ అక్షింతలు
♦ టెలికం అండర్ ఇన్వాయిసింగ్‌ను గుర్తించలేదు
♦ దీంతో ఖజానాకు నాలుగేళ్లలో రూ.12,488 కోట్ల నష్టం
♦ ఈ రెండు శాఖల అసమర్థతే కారణమని విమర్శ
న్యూఢిల్లీ: ఆరు టెలికం సంస్థలు 2006-2010 మధ్య తమ ఆదాయాలకు సంబంధించి అండర్ ఇన్వాయిస్ (బిల్లులు తక్కువ చేసే చూపించడం) విధానాలను అనుసరించాయని పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సోమవారం తేల్చిచెప్పింది. వీటిని గుర్తించలేకపోవడం ఆర్థిక, టెలికం శాఖల వైఫల్యమని పేర్కొంది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ, వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌ల అండర్ ఇన్వాయిసింగ్ వల్ల 2006-10 మధ్య ప్రభుత్వం రూ.12,488 కోట్లు నష్టపోయినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మూడు నెలల క్రితం పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించింది.
ఈ అంశాన్ని అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీ సోమవారం దీనిపై సంబంధిత అధికారులతో చర్చించింది. జరిగినదానికి ఆర్థిక, టెలికం శాఖలను తప్పుపట్టింది. ఈ రెండు శాఖలకు సంబంధించిన కొన్ని కార్యాలయాల అసమర్థ పని విధానమే దీనికి కారణమని విమర్శించింది. టెలికం శాఖలో కంట్రోలర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ (పీఏసీ), ఆర్థికశాఖలో ఫైనాన్షియల్ విభాగం పటిష్టంగా పనిచేసి ఉంటే... ఖజానాకు ఈ నష్టం సంభవించి ఉండేది కాదని పీఏసీ చైర్మన్ కేవీ థామస్ పేర్కొన్నట్లు ఉన్నత వర్గాల సమాచారం.