
పారగాన్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాదరక్షల తయారీ సంస్థ పారగాన్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. 2016 నాటికి దేశవ్యాప్తంగా 250 స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఏడాదిన్నర తర్వాత ఫ్రాంచైజీ విధానంలోనూ దుకాణాలను తెరుస్తామని పారగాన్ గ్రూప్ ప్రమోటర్, డెరైక్టర్ థామస్ మణి తెలిపారు. సినీ హీరో మహేష్‌బాబును పారగాన్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా (ప్రచారకర్త) మంగళవారమిక్కడ ప్రకటించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
కస్టమర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకే ప్రత్యేక షోరూంలను ప్రారంభిస్త్తున్నామని చెప్పారు. 2020 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహేష్‌బాబుకు అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారని, అందుకే ఆయనను ప్రచారకర్తగా నియమించామని చెప్పారు.
ఎంతైనా వెచ్చిస్తారు..: పిల్లల నాణ్యమైన పాదరక్షల కోసం తల్లిదండ్రులు ఎంతైనా వెచ్చిస్తున్నారని థామస్ మణి చెప్పారు. ‘పిల్లల పాదరక్షల మార్కెట్ పరిమాణం దేశంలో సుమారు రూ.7 వేల కోట్లు. పిల్లల కోసం 30 రకాల డిజైన్లను పరిచయం చేశాం. 6 నెలల్లో మరో 20 డిజైన్లు రానున్నాయి. ఈ విభాగంపై ప్రత్యేక ద ృష్టి పెడతాం’ అని అన్నారు. బ్రాండెడ్ పాదరక్షల వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉందన్నారు. రూ.25 వేల కోట్ల పాదరక్షల విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా 20% లోపే. ధర విషయానికి వస్తే 90% అమ్మకాలు రూ.500లోపు లభించే వేరియంట్లవే.
రూ.1,600 కోట్లు..: పారగాన్‌కు దేశంలో 19 ప్లాంట్లు, 250 స్టిచ్చింగ్ యూనిట్లున్నాయి. మహారాష్ట్రలో రూ.100 కోట్లతో రోజుకు 25 వేల జతల పాదరక్షలు తయారీ సామర్థ్యం గల ప్లాంటు పెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది. అమ్మకాల్లో ఏటా 25% వృద్ధి నమోదు చేస్తున్నట్టు పారగాన్ మార్కెటింగ్ డెరైక్టర్ జోసెఫ్ జకారియా తెలిపారు. ‘2013-14లో 12 కోట్ల జతలు విక్రయించాం. రూ.1,400 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ ఏడాది 14 కోట్ల జతలతో రూ.1,600 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం’ అని తెలిపారు.