
న్యూఢిల్లీ: స్వదేశీ నినాదంతో బహుళజాతి ఎఫ్‌ఎంసీజీ సంస్థలకు సవాల్ విసురుతున్న బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్... ఇప్పుడు మరింత బలపడేందుకు విదేశీ నిధుల వేటలో తలమునకలైంది. పలు వెంచర్ ఫండ్స్‌తో చర్చలు ప్రారంభించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.10,500 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ఈక్విటీ ఫండ్స్‌తో సమావేశాలు నిర్వహిం చాం. గత కొన్ని నెలల్లో 12కు పైగా వెంచర్ క్యాపిటలిస్టులతో భేటీ అయ్యాం’’ అని పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజర్వాలా తెలిపారు.
కలసి పనిచేసేందుకు సిద్ధం...
పతంజలితో కలసి పనిచేయడానికి ఇష్టమేనని ఫ్రాన్స్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్ ప్రకటించింది. అయితే, విదేశీ నిధులతో, బహుళజాతి సంస్థలతో పతంజలి కలసి పనిచేయకపోవచ్చని ఎల్‌క్యాటరన్ ఏషియా ఎండీ రవితక్రన్ చెప్పారు. ఎల్‌క్యాటరన్ ఈక్విటీ ఫండ్‌కు ఎల్‌వీఎంహెచ్ సహ యజమాని. 500 మిలియన్ డాలర్లతో (రూ.3,250 కోట్లు) పతంజలిలో వాటా తీసుకునేందుకు ఆసక్తితో ఉంది. పతంజలి ప్రస్తుత విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.32.500 కోట్లు) ఉంటుందని తక్రన్ పేర్కొన్నారు.
రుణాలే తీసుకుంటాం
‘‘నాగ్‌పూర్, గ్రేటర్ నోయిడా, అసోం, చండీగఢ్, ఏపీ, తెలంగాణ, హర్యానా, రాజస్తాన్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకానికి తక్షణమే రూ.5,000 కోట్ల నిధుల అవసరం ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందగలం. కానీ, బ్యాంకుల కంటే తక్కువ రేటుకు భారత కరెన్సీ రూపంలో నిధుల కోసం అన్వేషిస్తున్నాం. ఎవరికీ కంపెనీలో వాటాలిచ్చే ఉద్దేశం లేదు. ఈక్విటీ లేదా షేర్ల రూపంలో నిధులను అంగీకరించం.’’
– ఆచార్య బాలకృష్ణ
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment