మాల్యాకు వార్నింగ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఎగవేతదారుడు, బ్రిటన్‌లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు బెయిల్ కు వీలుకాని వారెంట్లు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు. కాగా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్ ను రూ.135 కోట్లకు వేలం వేసినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు.