రూ.25వేల కోట్లు చెల్లించండి!
ఓఎన్‌జీసీ, రిలయన్స్, షెల్‌కు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్ కంపెనీలకు 3.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,487 కోట్లు) బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. దాదాపు రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) జారీ చేసిన ఈ నోటీసు విషయాన్ని తాజాగా ఓఎన్‌జీసీ ధ్రువీకరించింది.
అరేబియా సముద్రంలోని పన్నా–ముక్తా అండ్ తపతీ (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల విషయంలో ‘డిఫరెన్షియేట్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్– పెట్రోలియం అండ్ రాయిల్టీ’ కింద చెల్లించాల్సిన మొత్తాల విషయంలో తనకు సానుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం ప్రభుత్వం తాజా నోటీసులు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఎంటీలో ఓఎంజీసీకి 40 శాతం వాటా ఉంది. ఆర్‌ఐఎల్, షెల్ కంపెనీలకు 30 శాతం చొప్పున వాటా ఉంది. దీనిప్రకారం ఓఎన్‌జీసీ చెల్లించాల్సిన మొత్తం రూ.10,195 కోట్లు.