
మహిళలకు బంగారానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్ లేదు. కానీ, ఇది గతం! కొన్నేళ్లుగా మహిళలు ట్రెండ్ మార్చేశారు. ప్రాపర్టీల కొనుగోళ్లలో స్త్రీలు రాజ్యమేలుతున్నారు. దేశంలోని 42 శాతం మంది మహిళలు రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే తెలిపింది. 30 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 17 శాతం మంది బంగారం బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారని నివేదించింది. మహిళలకు స్టాంప్ డ్యూటీ, గృహ రుణ వడ్డీ రేట్లలో తగ్గింపులు, పన్ను ప్రయోజనాలుండటం అదనపు కారణాలని పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: మారుతున్న ప్రపంచంలో ఇల్లు తన పేరు మీద ఉండటం అత్యంత భద్రంగా భావిస్తుంది నేటి మహిళ. అందుకే ఇంటి యజమానిగా లేదా సహ–యజమానిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో ఇంటి వసతుల విషయంలో మాడ్యులర్ కిచెన్, పూజ గది, గార్డెన్ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు.. నేడు పురుషులతో సమానమైన వసతులను కోరుకుంటున్నారు. విస్తీర్ణం విషయంలోనూ నేటి మహిళలు రాజీ పడట్లేదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. 80 శాతం మంది మహిళలు పెద్ద సైజు గృహాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 1000–1250 చ.అ. 2 బీహెచ్‌కే, 1250–2000 చ.అ. 3 బీహెచ్‌కే నిర్మాణాలనే ఎంపిక చేస్తున్నారన్నారు. 60 శాతం మహిళలు రూ.80 లక్షల లోపు ఇళ్ల కొనుగోళ్లకు, 52 శాతం మహిళలు గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న గృహాల కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.
మహిళలకు స్టాంప్ డ్యూటీలో తగ్గింపులు..
మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు గృహ కొనుగోళ్ల వైపు మహిళలను ఆకర్షించేందుకు స్టాంప్ డ్యూటీలోనూ మినహాయింపులు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ వేర్వేరు ప్రాంతాలను బట్టి స్టాంప్ డ్యూటీలో తగ్గింపులున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి ఇది 1–2 శాతంగా ఉంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్ డ్యూటీలో సడలింపులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 శాతం స్టాంప్ డ్యూటీ ఉండగా.. మహిళలకు మాత్రం మొత్తం చార్జీల మీద రూ.10 వేలు తగ్గింపు ఉంది. కొందరు పురుషులు ఏం చేస్తున్నారంటే? స్టాంప్ డ్యూటీ చార్జీలను తగ్గించుకునేందుకు ముందుగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి.. కొంత కాలం తర్వాత ఇంట్లోని పురుషుల పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గోవా వంటి కొన్ని రాష్ట్రాలు కనీసం ఏడాది లోపు గృహాల రీ–రిజిస్ట్రేషన్స్ మీద నిషేధం విధించాయి.
అందుబాటు గృహాలు ఓన్లీ లేడీస్..
ప్రభుత్వం కూడా మహిళ గృహ కొనుగోలుదారులకు అదనపు పన్ను రాయితీలు, ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో ప్రాపర్టీ కొనుగోళ్ల మీద మహిళల ఆసక్తి మరింత పెరిగింది. అందుబాటు గృహాలను కేవలం మహిళా యజమాని లేదా సహ–యజమానిగా ఉండాలన్న నిబంధనను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇల్లు మహిళ పేరు మీద లేదా కో–ఓనర్‌గానైనా ఉన్నట్లయితే... అందులోనూ సంపాదించే మహిళ అయితే భార్యభర్తలిద్దరూ పన్ను తగ్గింపులు పొందే వీలుంది.
బ్యాంక్ వడ్డీ రేట్లూ తక్కువే..
పురుషులతో పోలిస్తే మహిళలకు గృహ రుణాల్లోనూ సడలింపులున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంక్‌లు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్‌ను బట్టి ఇది 1 శాతం వరకుంటుంది. ఉదాహరణకు ఎస్‌బీఐలో రూ.30 లక్షల వరకు గృహ రుణానికి మహిళలకు 8.75 – 8.85 శాతం, ఇతరులకు 8.80 నుంచి 8.90 శాతం వడ్డీ రేట్లున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీలో మహిళలకు 8.90, ఇతరులకు 8.95 శాతంగా రేట్లున్నాయి.
కనికరం లేని తెలుగు రాష్ట్రాలు..
దేశంలోని చాలా రాష్ట్రాలు గృహ కొనుగోళ్లలో మహిళలను ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపులిస్తుంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం కనికరించట్లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేపిస్తే స్టాంప్ డ్యూటీలో 2 శాతం తగ్గింపు ఉండేది. కానీ, ఆయన అనంతరం దీన్ని ప్రభుత్వాలు అటకెక్కించాయి. అందుబాటు గృహాల మీద కేంద్రం జీఎస్‌టీని 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టాంప్ డ్యూటీని 6.1 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి కోరారు.
ఏపీలో వినతిపత్రం అందజేత
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్ డ్యూటీ 7.5 శాతంగా ఉంది. అఫడబుల్ హౌజింగ్ వైపు మహిళలను ఆకర్షించాలంటే 1000 చ.అ.లోపు ఉన్న గృహాల స్టాంప్ డ్యూటీని 1– 2 శాతానికి చేర్చాలి. ఈ విషయమై ఇటీవలే క్రెడాయ్ ఏపీ చాప్టర్ తరుఫున ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాం.
– ఎ. శివారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ ఏపీ వైఎస్‌ఆర్ హయాంలో 2% తగ్గింపు
ప్రస్తుతం తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు 6.1 శాతంగా ఉన్నాయి. వైఎస్‌ఆర్ హయాంలో అందుబాటు గృహా లను ప్రోత్సహించేందుకు రెండేళ్ల పాటు స్టాంప్ డ్యూటీని తగ్గించినట్లే.. తెలంగాణ ప్రభుత్వం కూడా చార్జీలను 2 శాతానికి పరిమితం చేయాలి.
– జీ రాంరెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment