
అప్పు కోసం యాప్ చాలు!
► లేదంటే ఏటీఎంకు వెళితే సరి!
► పోటీ నేపథ్యంలో కస్టమర్ల చెంతకే ‘రుణ’ సేవలు
► ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫర్
► వాటితో జతకట్టి స్టార్టప్‌లూ రంగంలోకి...
ఒకప్పుడు రుణం కావాలంటే చెప్పులు అరిగిపోయేలా బ్యాంకులో లేకపోతే ఆర్థిక సంస్థల చుట్టూనో తిరగాల్సి వచ్చేది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా ‘రుణం తీసుకోండి’ అంటూ వెంటపడే రోజులు. ‘బ్యాంకు వరకూ రావక్కర్లేదు ఏటీఎం మెషీన్ నుంచే దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే రోజు రుణం మొత్తం ఖాతాలో జమ అవుతుంది’ ఇదీ తాజాగా బ్యాంకులిస్తున్న ఆఫర్. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చిటికెలో రుణాలిచ్చే ఫైనాన్షియల్ యాప్స్ కూడా ఎన్నో వచ్చేశాయి. ఆ వివరాలివిగో...
ఏటీఎంల నుంచే...
ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ... ఇటీవలే ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే వినూత్న విధానాన్ని ప్రారంభించింది. కాకపోతే అందరికీ కాకుండా తన బ్యాంకులో వేతన ఖాతాలున్న ఎంపిక చేసిన కొందరికే తొలుత దీన్ని పరిమితం చేసింది. రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచించే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి ఈ అవకాశం కల్పించింది. తర్వాత కాలంలో మరింత మందికి ఈ విధంగా రుణాలు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామనీ తెలిపింది. అర్హత కలిగిన వారు ఏటీఎంలో ఏదైనా లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణానికి సంబంధించిన సందేశం కనిపిస్తుంది.
ఓకే చెబితే చాలు! కస్టమర్ ఖాతాలో రుణం జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పైనే రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వివరాలన్నీ కనిపిస్తాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం నెట్‌బ్యాంకింగ్ నుంచే పర్సనల్ లోన్ తీసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. బ్యాంకుల్లో రుణం లభించాలంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ మీకు క్రెడిట్ హిస్టరీ లేకున్నా, లేదా బ్యాంకుతో దీర్ఘకాలిక అనుబంధం లేకున్నా సులభంగా రుణం కావాలనుకున్నా స్టార్టప్ యాప్‌లను సంప్రదించాల్సిందే. ఎర్లీశాలరీ డాట్ కామ్, లోన్‌ట్యాప్ ఇటువంటివే.
యాప్ ఉంటే చాలు
ఎటువంటి రుణ చరిత్రలేని కస్టమర్లను స్టార్టప్‌లు తమ వ్యాపార విస్తరణకు ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కాకపోతే వివిధ రకాల అంశాల ఆధారంగా రుణ అర్హతను తేల్చేస్తాయి. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, స్నేహితుల జాబితా, వారి ఖర్చుల తీరు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ ఆధారంగా ఆర్థిక సామర్థ్యం, చరిత్రను విశ్లేషించి చూస్తాయి. ఎర్లీశాలరీ డాట్‌కామ్ అయితే ఒక రోజు నుంచి ఒక నెల కాలానికి పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేస్తోంది. యాప్ ద్వారా రుణ దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ పత్రాలను జత చేసిన తర్వాత, అర్హత ఉంటే కొన్ని గంటల్లోపే రుణం మంజూరు అవుతుంది. కేవైసీ అన్నది మొదటిసారి మాత్రమే.
ఒకసారి కేవైసీ ఇచ్చి, పర్సనల్ లోన్ తీసుకుని ఉన్నవారు, ఆ తర్వాత ఎప్పుడు రుణం కావాలన్నా అప్పటికప్పుడే పొందొచ్చు. దరఖాస్తుదారుల్లో 35% మంది కొత్తగా రుణాలు తీసుకుంటున్నవారే ఉంటున్నారని ఎర్లీశాలరీ సహ వ్యవస్థాపకుడు మెహరోత్రా తెలిపారు. ఇక లోన్‌ట్యాప్ అయితే రూ.5 లక్షల్లోపు రుణం ఆఫర్ చేస్తోంది. ఒక రోజు నుంచి ఐదేళ్ల వ్యవధికి రుణాన్ని తీసుకోవచ్చు. ఈ సంస్థ అందించే రుణం క్రెడిట్‌కార్డును పోలి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత కనీస మొత్తం చెల్లించి, మిగిలిన రుణంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని లోన్‌ట్యాప్ సీఈవో సత్యం తెలిపారు.
ఇతర సంస్థలు సైతం
ఇక క్యుబెరా డాట్ కామ్ వంటి మధ్యవర్తిత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్, పేసెన్స్‌తో జతకట్టి రుణాలను ఆఫర్ చేస్తోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కూడా ఈ తరహాలోనే పనిచేస్తోంది. క్యుబెరా, పేసెన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్న వారిలో పెద్ద బ్యాంకుల ఖాతాదారులు సైతం ఉంటున్నారు. రుణ మంజూరులో ఉన్న వెసులుబాటే అందుకు కారణం.
ఒకసారి కస్టమర్‌కు రుణాన్ని మంజూరు చేసి వారితో అనుబంధం ఏర్పడితే ఇక ఆ తర్వాత ఇన్‌స్టంట్‌గానే రుణాన్ని అందిస్తున్నట్టు పేసెన్స్ వ్యవస్థాపకుడు సయాలి కరంజ్‌కార్ తెలిపారు. అయితే, రుణాలు తీసుకోవడంలో ఉన్న ఈ సౌలభ్యాన్ని చూసి రుణ ఉచ్చులో చిక్కుకోవద్దని ఆర్థిక పండితులు సూచిస్తున్నారు. రుణం చెల్లించడంలో విఫలమైతే అవి క్రెడిట్ బ్యూరోకు సమాచారం చేరవేస్తాయి. దీంతో ఆ తర్వాత ప్రైవేటు సంస్థల వద్ద కూడా రుణం లభించడం కష్టతరమవుతుంది.
అత్యవసరమైతేనే
అత్యవసర పరిస్థితుల్లోనే ఈ తరహా సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, సాధారణ ఖర్చుల కోసం రుణాన్ని ఆశ్రయించి చిక్కులు తెచ్చుకోవద్దంటున్నారు. వ్యయాలు నియంత్రించుకోలేని పరిస్థితుల్లోనే సాధారణ వ్యక్తులు ఎక్కువ సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారని హెచ్చరిస్తున్నారు. ఒకసారి రుణం తీసుకున్న తర్వాత మరోసారి తిరిగి రుణం తీసుకోకుండా ఉండడం కష్టమేనని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మల్హార్ మజుందార్ పేర్కొన్నారు.