పెట్రోల్ ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్దుగా ఏ మాత్రం మారకుండా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల అనంతరం భగ్గుమంటున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో స్కై రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.75 మార్కును క్రాస్ చేసింది. ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్ నుంచి ఇదే గరిష్ట స్థాయి. ఇతర మెట్రోపాలిటన్ నగరాలు కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్‌లో రూ.79.55గా నమోదైనట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ డేటాలో వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్‌కతాలో 16 పైసలు పెరిగాయి.
మరోవైపు డీజిల్ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ.. వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్‌కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్‌లో రూ.72.36గా నమోదవుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రికార్డు స్థాయిలో ఈ ధరలను పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా ఎగుస్తున్నాయి. దాంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తోంది. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్‌కు ప్రస్తుతం 78 డాలర్లు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment