న్యూఢిల్లీ : ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డులను బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి పెరగడమే తప్ప, తగ్గడం కనిపించడం లేదు. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ ప్రభుత్వం తనకు అనుమతి ఇచ్చి, పన్నుల్లో ఉపశమనం కల్పిస్తే, లీటరు పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే అందిస్తానని అన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అంతేకాకుండా 28 శాతం శ్లాబ్‌ను తీసేయాలని బాబా రాందేవ్ సూచించారు. ఎన్‌డీటీవీ యువ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు.
పెట్రోల్, డీజిల్‌పై మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడంపై రాందేవ్ బాబా పలు ప్రశ్నలను లేవనెత్తారు. పన్నులను వాహనదారుల నుంచి కాకుండా.. ధనవంతలను నుంచి వసూలు చేయాలన్నారు. ఇంధనాలపై పెరుగుతున్న ధరలు, మోదీ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ అంశాలు, మోదీ ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కల్పించడానికి నిరాకరించడం ఇవన్నీ ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై మొత్తంగా రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. అది కాక, రాష్ట్రాలు వ్యాట్‌లను విధిస్తున్నాయి.
ఇంధన ధరలతో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో నానాటికీ అసహనం పెరిగిపోతోందని రాందేవ్ పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చాలా విధానాలు బాగున్నాయని, కానీ కొన్నింటిన్నీ సవరించాల్సి ఉందని చెప్పారు. వీటిలో అతిపెద్ద సమస్య ధరల పెరుగుదలేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాందేవ్ అన్నారు. రాఫెల్ డీల్‌పై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాందేవ్.. అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నానని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీ తరుఫున ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment