
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. మంగళవారం మెట్రోల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 10-12 పైసల చొప్పున పెరిగాయి. రోజువారీ ధరల సమీక్ష కింద ఉదయం 6 గంటలకు మారిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.8, కోల్‌కత్తాలో రూ.72.55, ముంబైలో రూ.76.9, చెన్నైలో రూ.72.35గా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ధరలు సోమవారం స్థాయి ధరలకు 11-12 పైసలు అధికం. అదేవిధంగా ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.58.26, కోల్‌కత్తాలో రూ.60.92, ముంబైలో రూ.60.98, చెన్నైలో రూ.61.36గా ఉన్నాయి. సోమవారం రేట్లతో పోలిస్తే డీజిల్ ధరలు కూడా లీటరుకు 10-11 పైకి ఎగిశాయి.
ఈ నెల మొదటి నుంచి లీటరు పెట్రోల్ ధరలు 65-71 పైసల చొప్పున పెరుగగా.. డీజిల్ ధరలు 56-60 పైసలు చొప్పున పెరిగాయి. 2017 జూన్ 16 నుంచి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ ధరల సమీక్ష ప్రకారం అంతర్జాతీయ ఆయిల్ ధరల్లో మార్పులను వెనువెంటనే వినియగదారులకు చేరవేయలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగడం తప్ప, తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశీయంగా కూడా చమురు ధరలు మోతెక్కిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 2015 జూన్ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.5 శాతం పెరిగి 64.23 డాలర్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment