ముంబై : పెట్రోల్ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెట్రోల్ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్ సైతం ఆల్-టైమ్ హైలో రూ.65.46గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం 2013 సెప్టెంబర్ నుంచి ఇదే తొలిసారి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు కొనసాగుతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం శనివారం పెట్రోల్ ధరలు న్యూఢిల్లీలో రూ.74.21గా, కోల్‌కత్తాలో రూ.76.91గా, ముంబైలో రూ.82.06గా, చెన్నైలో రూ.76.99గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.65.46గా, కోల్‌కత్తాలో రూ.68.16గా, ముంబైలో రూ.69.7గా, చెన్నైలో రూ.69.06గా నమోదయ్యాయి. గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అత్యధిక స్థాయిలకు చేరుకుంటున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీ కోతలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 2017 అక్టోబర్‌లో మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment