ఉచితంగా ఫొటో ప్రింట్..! | Photo Print for free | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఫొటో ప్రింట్..!

Published Sat, Dec 26 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

ఉచితంగా ఫొటో ప్రింట్..!

ఉచితంగా ఫొటో ప్రింట్..!

 సరికొత్త సేవలందిస్తున్న జస్ట్‌క్యాప్చర్.కామ్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
: ఒక్క ఫొటో వంద భావాలను పలికిస్తుందంటారు పెద్దలు. కానీ ఫొటోతో భావాలే కాదు.. బిజినెస్సూ చేయొచ్చంటున్నారు మనీష్, రాహుల్ అగర్వాల్. సెలబ్రిటీలనే కాదు.. సామాన్యుల ఫొటోలనూ వ్యాపార ప్రకటనల్లో వినియోగించొచ్చని నిరూపించారు. జస్ట్ క్యాప్చర్.కామ్ వేదికగా దీన్ని నిజం చేస్తున్నారు కూడా. రాజస్తాన్‌కు చెందిన ఈ ఇద్దరు మిత్రులు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థులు.
 
  వీరు ప్రారంభించిందే ఈ స్టార్టప్. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే..
 ‘‘టీవీలో ప్రకటనలొస్తే చానల్ మార్చేస్తారు. పత్రికల్లో ఇస్తే అందరూ చూస్తారన్న గ్యారంటీ లేదు. పోనీ హోర్డింగ్స్ పెడితే.. ఎక్కడ ఏ హోర్డింగ్ పెట్టామో మనకే సరిగా గుర్తుకు రాదు.’’.. ఇదీ ప్రకటనదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి సరైన పరిష్కారం చూపించింది ‘జస్ట్ క్యాప్చర్.కామ్’! ఫొటోల వెనక.. అదీ వ్యక్తిగత ఫొటోల వెనక ప్రకటనలివ్వడమే దీని పని. ఈ ప్రత్యేకతే ఇదే  అటు వాణిజ్య సంస్థలను.. ఇటు కస్టమర్లనూ ఆకర్షించింది.
 
 ‘‘ఆలోచనైతే బాగుంది కానీ, వ్యక్తిగత ఫొటోల వెనక ప్రకటనలు ప్రింట్ చేసుకుంటామంటే ఎవరొప్పుకుంటారు చెప్పండి. అందుకే ఫొటోలేవైనా.. ఎన్నైనా సరే ఉచితంగా ప్రింట్ చేసిస్తే ఆలోచిస్తారనిపించింది. ఫొటో వెనక ప్రాంతంలో ప్రకటనలు ప్రింట్ చేస్తే వాటిని కస్టమర్లు తప్పకుండా చూస్తారని వాణిజ్య సంస్థలకూ తెలిసింది. అలా రూ.50 వేల పెట్టుబడితో 2015 మార్చిలో జస్ట్ క్యాప్చర్.కామ్ ప్రారంభమైందని’’ సంస్థ ఆరంభం గురించి చెప్పుకొచ్చారు మనీష్ అగర్వాల్.
 
 ఒక్క కస్టమర్‌కు నెలకు 6 ఫొటోలే..
 ఒక్క క స్టమర్ నెలకు 6 ఫొటోలను మాత్రమే అప్‌లోడ్ చేసే వీలుంటుంది. 6/4 సైజ్‌లో.. 300 రిజల్యూషన్‌తో.. గ్లాసీ లేదా మ్యాట్ ఫినిష్‌తో ఫొటోలను ప్రింట్ చేసి ఇంటికి డెలివరీ చేసిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 15 వేల మంది కస్టమర్లకు చేరుకున్నాం. రోజుకు 250 మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. పాత కస్టమర్ లాగిన్ రిఫరెన్స్ మీద కొత్తగా ఆరుగురు లాగిన్ అయితే ఆ కస్టమర్‌కు ఉచితంగా బహుమతులందిస్తున్నాం.
 
 22 కంపెనీలతో ఒప్పందం..
 మీ ఫొటోల ప్రింటింగ్‌తో పాటు యాడ్ ప్రింటింగ్ ఖర్చులన్నీ ప్రకటన కంపెనీయే చూసుకుంటుంది. ఒక్కో ఫొటో ప్రింటింగ్‌కు రూ.20 చార్జీ చేస్తాం. ఇప్పటివరకు జూమ్‌కార్, ఫ్రెంచ్‌బాబ్, బాబాజీ నేత్రాలయ వంటి సుమారు 22 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కళామందిర్, కాంటినెంటల్, అపోలో, ఓలా, మన్నెపల్లి జువెల్లర్స్, అభిబస్ వంటి సంస్థలతో చర్చిస్తున్నాం. ఒక్కో కంపెనీ కనిష్టంగా 3,000 ఫొటోలను ఆర్డరివ్వాల్సి ఉంటుంది.
 
 3 నెలల్లో విజయవాడ, విశాఖలకూ..

 రెండు నెలల క్రితమే ఓ ఏంజెల్ ఇన్వెస్టర్ నుంచి రూ.40-50 లక్షల నిధులను సమీకరించాం. వచ్చే జనవరి-ఫిబ్రవరి మధ్యలో మరో రూ.6-7 కోట్ల సమీకరణ చేయనున్నాం. వీటితో బెంగళూరు, ముంబైలతో పాటుగా దేశంలోని ప్రధాన నగరాలకూ విస్తరిస్తాం. మరో 3 నెలల్లో విజయవాడ, విశాఖపట్నాల్లో తమ సేవలను ప్రారంభించనున్నామని’’ మనీష్ చెప్పారు.  ప్రస్తుతం తమ సంస్థలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, గత నెలలో రూ.2 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నామని తెలియజేశారాయన.
 అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
 startups@sakshi.comకు మెయిల్ చేయండి...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement