హెచ్‌ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు
న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్‌పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు.
తాజాగా నిర్దేశించిన పరిమితుల ప్రకారం హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే నెవిరాపైన్ కాంబినేషన్ ఔషధ ట్యాబ్లెట్‌పై సీలింగ్ ధర రూ. 14.47గా ఉంటుంది. క్యాన్సర్ సంబంధ కీమోథెరపీలో ఉపయోగించే సైటోసిన్ అరాబినోసైడ్ ఒక్కో ప్యాక్ ధర (500 మి.గ్రా) రూ. 455.72గా ఉండనుంది.