
మేకిన్ ఇండియా నౌకలకు సాయం
భారత్‌లో నిర్మించే నౌకలకు 20% ఆర్థిక సహకారం కేంద్రం కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా నౌకానిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో నిర్మించిన నౌకలపై 20 శాతం మేర ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ. 4,000 కోట్ల మేర బడ్జెట్‌పరమైన మద్దతు అవసరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులు, టర్నోవరుపరంగానే కాకుండా ఉపాధి అవకాశాలపరంగా కూడా మౌలిక రంగం స్థాయిలో ప్రభావం చూపే నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నౌకానిర్మాణ రంగానికి పన్నులపరమైన ప్రయోజనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగ హోదా తదితర అంశాలు కూడా తాజా ప్రతిపాదనలో ఉన్నాయి.