క్యూ2 ఫలితాలు కీలకం..
రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలకూ ప్రాధాన్యత
* ఐఐపీ ఎఫెక్ట్ ఉంటుంది
* ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
* ఈ వారం మార్కెట్ల తీరుపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి దేశీ కార్పొరేట్ దిగ్గజాల పనితీరుపై మార్కెట్లు దృష్టిపెడతాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఈ వారం క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇవికాకుండా రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సోమవారం(13న), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు మంగళవారం(14న) వెలువడనున్నాయి.
అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం(15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, గడిచిన శుక్రవారం(10న) మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి. పలు మీడియా సంస్థలు, ఆర్థికవేత్తలు 2% స్థాయిలో పారిశ్రామిక వృద్ధిని అంచనా వేయగా, 0.4%కు పరిమితమైంది. ఈ ప్రభావం సోమవారం(13న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు.
చమురు ధరల ప్రభావం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపట్ల చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్నాయి. మరోవైపు డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ఈ రెండు అంశాలు మార్కెట్ల దిశను నిర్ధారించే అవకాశముందని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై దృష్టి
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) లావాదేవీలపైనా ప్రధానంగా ట్రేడర్లు దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది నెలల ట్రెండ్‌కు విరుద్ధంగా రెండు వారాల నుంచి దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఐల పెట్టుబడుల తీరు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముందని స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం ట్రెండ్‌పై తొలుత ఐఐపీ ప్రభావం ఉంటుందని, ఆపై సీపీఐ వివరాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ప్రధానంగా వినియోగ వస్తువులకు డిమాండ్ తగ్గడం, తయారీ రంగం మందగించడం వంటి అంశాల కారణంగా ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి చేరిందని జయంత్ విశ్లేషించారు.
ఫలితాల బాటలో దిగ్గజాలు
ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి దిగ్గజాలతోపాటు, ఆటో రంగ దిగ్గజాలు బజాజ్ ఆటో, హీరోమోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి ఈ వారం ట్రేడింగ్‌ను దిగ్గజాల ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నడిపించనున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ బలహీనతల కారణంగా గత వారం సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగిసింది.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఈక్విటీలలో నికరంగా రూ.800 కోట్ల అమ్మకాలను చేపట్టారు. అయితే ఇదే సమయంలో మరోపక్క రుణ సెక్యూరిటీలలో రూ. 6,300 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. 7 నెలల తరువాత మళ్లీ సెప్టెంబర్ నెలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కనిష్టానికి చేరిన నేపథ్యంలో తాజా అమ్మకాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలకంటే ముందుగానే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించవచ్చునన్న అంచనాలు ఇందుకు కొంతమేర కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీ మార్కెట్లు స్థిరీకరణ(కన్సాలిడేషన్)లో ఉన్నాయని, దీంతో ఎఫ్‌ఐఐలు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నారని సీఎన్‌ఐ రీసెర్చ్ హెడ్ కిషోర్ ఓస్త్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 82,561 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, సెప్టెంబర్‌లో ఇవి రూ. 5,100 కోట్లు.