తీవ్ర హెచ్చుతగ్గులుంటాయ్..
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం
* క్యూ4 ఫలితాలపై చూపు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ తదితర బ్లూచిప్ కంపెనీల నుంచి వెలువడే క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని, అయితే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా మన సూచీల కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుందని వారు వివరించారు.
ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనున్నది. ఈ వారం యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి.
రిలయన్స్ ఫలితాల ఎఫెక్ట్...
గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలకు స్పందించడం ద్వారా ఈ సోమవారంనాటి ట్రేడింగ్ ఆరంభమవుతుందని, తద్వారా తదుపరి సూచీల దిశ నిర్దేశితమవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. 8 ఏళ్లలో రికార్డుస్థాయి క్వార్టర్లీ నికరలాభాన్ని రిలయన్స్ ప్రకటించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్ల జోరు దీనికి ప్రధాన కారణం.
అయితే రానున్న త్రైమాసికాల్లో ఈ స్థాయి మార్జిన్లను కంపెనీ సాధించగలుగుతుందా, లేదా అనే అంచనాలతో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు.
పార్లమెంటు సమావేశాలపై దృష్టి...
సోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్ని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ సమావేశాల్లో దివాలా బిల్లు, జీఎస్‌టీ బిల్లులు ఆమోదానికి నోచుకోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి.
బోర్డ్ మీటింగ్స్ ఈ వారం..
25-సోమవారం: ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్పాంజ్ ఐరన్, వెల్‌స్పన్ ఇండియా ఏబీబీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్
26-మంగళవారం: యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, మారుతీ సుజుకీ, రేమండ్
27-బుధవారం: భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, యస్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్
28-గురువారం: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐడియా సెల్యులర్, ఏసీసీ, అంబుజా సిమెంట్,
29 -శుక్రవారం: ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో, ఐడీఎఫ్‌సీ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్